పవార్ నేతృత్వంలో కమిటీ

16 Sep, 2013 23:47 IST|Sakshi
నాగపూర్: వరదబాధిత ప్రాంతాల సహాయ విధివిధానాల రూపకల్పనకు ఓ ఉన్నతస్థాయి కమిటీని నియమించే యోచనలో కేంద్రప్రభుత్వం ఉందని వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్ తెలిపారు. కమిటీకి తానే స్వయంగా నేతృత్వం వహిస్తానని సోమవారం నాగపూర్‌లో విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. పంటనష్టంతోపాటు ప్రాణనష్టంపై కూడా కమిటీ దృష్టిసారించనున్నట్లు చెప్పారు. మూడురోజుల విదర్భ పర్యటన సందర్భంగా నాగపూర్‌కు వచ్చిన పవార్ ఇక్కడి పరిస్థితులను పరిశీలించారు. రుతుపవనాల ఆగమన, నిష్ర్కమణల అధ్యయనానికి జాతీయస్థాయిలో నియమించిన అధ్యయన బృందం పనితీరు చాలా మెరుగ్గా ఉందని, అంచనాలన్నీ దాదాపుగా నిజమయ్యాయన్నారు. శాస్త్రవేత్తలు, నిపుణుల పనితీరును ప్రశంసించారు. 
 
 గతసంవత్సరం వారు అంచనా వేసినట్లుగానే ఉత్తరాంధ్ర, కర్ణాటక, మరాఠ్వాడ ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. వారి అంచనాలు 90-95 శాతం నిజమయ్యాయని చెప్పారు. ఈ సంవత్సరం కూడా సదరు ప్రాంతాల్లో బాగా వర్షాలు కురుస్తాయని అంచనా వేశారని, ఊహించినట్లుగానే సాధారణస్థాయికి మించి వర్షపాతం నమోదైందని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో తక్కువ వర్షపాతం నమోదుకావడంతో కరువుపరిస్థితులు నెలకొన్నాయని,మరికొన్ని ప్రాంతాల్లో అధికవర్షపాతం కారణంగా పంటనష్టం, ప్రాణనష్టం సంభవించిందని, వీటిపై ప్రధానమంత్రి మనోహ్మన్ సింగ్‌కు మూడునాలుగు నెలల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు. ఇక యూపీఏ ప్రభుత్వ ఆహార భద్రతా బిల్లు గురించి మాట్లాడుతూ...
 
 దేశంలో 74 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు అనేక సర్వేలతో స్పష్టమైందని, వీరికి ఆహార భద్రతా బిల్లు కారణంగా ప్రయోజనం చేకూరనున్నట్లు చెప్పారు.  ఉన్న భూమిలోనే దేశ ప్రజల అవసరాలకు సరిపడా తిండిగింజలను ఉత్పత్తి చేయాల్సిన అవసరముందన్నారు. వర్షాభావప్రాంతాల్లో కూడా దీనిని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. ఇక విదర్భ ప్రాంతంలో జరిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక నివేదికలు తెప్పించుకుందని, త్వరలోనే సహాయ చర్యలకు ఉపక్రమిస్తుందన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని కేవలం పంట, ప్రాణనష్టాలకే పరిమితం చేయకుండా మౌలిక సదుపాయాల విషయంపై కూడా దృష్టిసారించాల్సిన అవసరముందన్నారు. వరదబాధిత ప్రాంతాల్లో రహదారులు, వంతెనలు, కల్వర్టులు తీవ్రస్థాయిలో దెబ్బతిన్న విషయాన్ని ఈ మూడురోజుల పర్యటనలో గుర్తించానని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు