కటకటాల్లో.. వైగో

4 Apr, 2017 11:59 IST|Sakshi
కటకటాల్లో.. వైగో

దేశద్రోహం కేసులో అరెస్టు
5 రోజులపాటు  జ్యుడీషియల్‌ కస్టడీ
ఎగ్మూరు కోర్టు ఆదేశం


సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగో మళ్లీ కట కటాల్లోకి వెళ్లారు. దేశద్రోహం కేసులో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 15 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలతో ఆయన్ను పుళల్‌ జైలుకు తరలించారు. బెయిల్‌కు అవకాశం కల్పించినా, వైగో తిరస్కరించారు. ఒకప్పుడు డీఎంకే ప్రచార ఫిరంగిగా తన వాక్‌ధాటితో  తమిళ రాజకీయాల్లో  వైగో ఓ వెలుగు వెలి గారు. డీఎంకే నుంచి బయటకు వచ్చి ఎండీఎంకే ఆవిర్భావంతో కష్టాలు తప్పలేదు.

తొలి నాళ్లల్లో ఆదరణ లభిం చినా, క్రమంగా కేడర్‌ మళ్లీ మాతృగూటికి చేరడంతో తంటాలు ఎదుర్కొంటూ, పార్టీని నెట్టుకు వస్తున్నారు. అయితే, ఎల్‌టీటీఈలకు వీరవిధేయుడిగా వ్యవహరిస్తూ, తరచూ వివాదాల్ని కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. వివాదాలు, వివాదాస్పద వ్యాఖ్యల్లో ముందుండే వైగో తరచూ జైలు జీవి తాన్ని గడపక తప్పలేదు. 2001లో ఎల్‌టీటీఈలకు మద్దతుగా వివా దాస్పద వ్యాఖ్యలు చేసి వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించారు.

 2009లో శ్రీలంకలో యుద్ధం సాగుతున్న సమయంలో వైగో స్పందించిన తీరు, మాటల తూటాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మీద దేశద్రోహం కేసు నమోదు అయింది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణను వైగో  ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎగ్మూర్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో సాగుతున్న విచారణకు స్వయంగా హాజరై వాదనల్ని వినిపిస్తూ వస్తున్నారు.  సోమవారం న్యాయమూర్తి గోపీనాథ్‌ ముందు జరిగిన విచారణలో వైగో తన వాదనలో ఎల్‌టీటీఈకి మద్దతును సమర్థించుకున్నారు. గతంలో  వైగో  వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్టుగా ఆధారాలు ఉన్నట్టు ఈసందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదన వినిపించారు.

ఈ సమయంలో వైగో స్పందిస్తూ, నాడు, నేడు, రేపు ఎల్లప్పుడు ఎల్‌టీటీఈలకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాననని, తన ధో?రణిలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. దీంతో ధోరణి మారని పక్షంలో జైలుకు వెళ్లాల్సి ఉంటుందని న్యాయమూర్తి హెచ్చరించారు. ఇందుకు తాను సిద్ధం అని వైగో వ్యాఖ్యానించడంతో 15 రోజుల జుడీషియల్‌ కస్టడీకి  ఆదేశాలు జారీ అయ్యాయి.

 అయితే, వైగోకు బెయిల్‌ అవకాశాన్ని కోర్టు కల్పించింది. తనకు బెయిల్‌ వద్దు అని,  జైలు శిక్షను అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వైగో స్పష్టం చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు పదిహేను రోజుల జుడీషియల్‌ కస్టడీ నిమిత్తం పుళల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.

>
మరిన్ని వార్తలు