మెదక్ @16 డి గ్రీలు

24 Oct, 2016 02:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగలు ఎండ, రాత్రి చలి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు ఇలానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మెదక్‌లో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, మహబూబ్‌నగర్, నల్లగొండల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 30 నుంచి 35 డిగ్రీల మధ్య నమోదవుతుండగా, రాత్రి ఉష్ణోగ్రతలు 16 నుంచి 22 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. ఖమ్మంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల తక్కువగా నమోదయ్యాయి. అక్కడ పగలు 34 డిగ్రీలు, రాత్రి 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

మహబూబ్‌నగర్, మెదక్, హన్మకొండల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల చొప్పున, హైదరాబాద్, నల్లగొండల్లో 2 డిగ్రీల చొప్పున తక్కువగా నమోదయ్యాయి. దీంతో రాత్రిళ్లు, తెల్లవారుజామున వాతావరణం చలిచలిగా ఉంటోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం పూట మంచు కురుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ఆ ఊసే లేదు. నైరుతి తెలంగాణను వీడి వెళ్లినా ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోందని, అది పూర్తిస్థాయిలో వెళ్లిపోయాక ఈశాన్య రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
 

>
మరిన్ని వార్తలు