నేడు సెంట్రల్, హార్బర్ మార్గాలపై ‘మెగాబ్లాక్’

3 Aug, 2013 23:47 IST|Sakshi
రైల్వే శాఖ ఆదివారం సెంట్రల్, హార్బర్ మార్గాలపై మెగాబ్లాక్ నిర్వహించనుంది. సిగ్నల్, ట్రాక్స్, ఓవర్ హెడ్ వైరు లాంటి సాంకేతిక యంత్రాలకు మరమ్మతులు చేపట్టనున్నారు. అం దుకు రైల్వే మార్గాలపై ఉదయం సుమారు 11 గం టల నుంచి సాయంత్రం నాలుగు వరకు రైలు సేవల్లో మార్పులు చేయనున్నారు. కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. పశ్చిమమార్గంలో ఆదివారం మెగాబ్లాక్ నిర్వహించడంలేదని రైల్వే తెలిపింది.
 
 సెంట్రల్‌లో...
  సెంట్రల్ రైల్వే మార్గంలో బైఖలా-విద్యావిహార్ స్టేషన్ల మధ్య డౌన్ స్లో లైన్‌లో మెగాబ్లాక్ ఉంటుంది. దీంతో స్లో లోకల్ రైలును బైఖలా తర్వాత ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. మళ్లీ విద్యావిహార్ తర్వాత స్లో ట్రాక్‌పై నడుపుతారు. ఈ క్రమంలో రైళ్లు కేవలం పరేల్, దాదర్, మాటుంగా, సైన్, కుర్లా స్టేషన్లలో హాల్ట్ అవుతాయి. ఇదిలా ఉండగా డౌన్ ఫాస్ట్ లైన్‌లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలీ, భాండూప్, ములుండ్ స్టేషన్లలో అదనంగా హాల్టవుతాయి. మెగాబ్లాక్ నేపథ్యంలో లోకల్ రైళ్లు 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి. 
 
 హార్బర్‌లో.....
 హార్బర్ మార్గంలో సీఎస్టీ నుంచి బాంద్రా/అంధేరిల మధ్య నడిచే లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. అప్ వెళ్లే లోకల్ రైళ్లు కుర్లా నుంచి సీఎస్టీ వరకు మెయిన్ లైన్‌లో నడుస్తాయి. ఈ క్రమంలో రైళ్లు కర్రీ రోడ్, చించ్‌పోక్లీ స్టేషన్లలో హాల్ట్ కావు. బాంద్రా/అంధేరీలకు వెళ్లే ప్రయాణికులు మెయిన్ లైన్, లేదా వెస్టర్న్ లైన్‌లో ప్రయాణించవచ్చు. 
 
 పశ్చిమ మార్గంలో మెగాబ్లాక్ రద్దు....
 పశ్చిమ మార్గంలో ఆదివారం మెగాబ్లాక్ నిర్వహించడం లేదు. రైల్వే అధికారులు ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచి నాలుగు గంటల వరకు వసయి రోడ్-విరార్ స్టేషన్ల మధ్య మరమ్మతులు పూర్తి చేసుకుంటారు. దీంతో ఆదివారం ఉదయం మెగాబ్లాక్ రద్దు చేస్తారు.
 
 సోమవారం 40 నిమిషాల బ్లాక్..
 అత్యవసర మరమ్మతుల దృష్ట్యా సెంట్రల్ రైల్వే శాఖ ఆసన్‌గావ్-వాసింద్ స్టేషన్ల మధ్య ఉదయం 10.20 నుంచి 11 గంటల వరకు 40 నిమిషాల పాటు మెగాబ్లాక్ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 9.26 గంటల సీఎస్టీ-ఆసన్‌గావ్, అలాగే ఉదయం 11.16 గంటల ఆసన్‌గావ్-సీఎస్టీ లోకల్ రైళ్లను రద్దు చేయనున్నారు. ఉదయం 10.10 గంటలకు కసరా నుంచి సీఎస్టీకి బయలుదేరే రైలును 10.40 గంటలకు నడపనున్నారు. 
 
మరిన్ని వార్తలు