కశ్మీర్ శాంతికి మూడు సూత్రాల ప్రణాళిక

28 Aug, 2016 02:58 IST|Sakshi
కశ్మీర్ శాంతికి మూడు సూత్రాల ప్రణాళిక

ప్రధాని మోదీకి వివరించిన మెహబూబా
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో శాంతి పునరుద్ధరణకు మూడు సూత్రాల కార్యాచరణ ప్రణాళికను ప్రధాని మోదీకి ఆ రాష్ట్ర సీఎం మెహబూబా ముఫ్తీ సమర్పించారు. కశ్మీర్‌కు చెందిన అన్ని వర్గాలతో చర్చలు నిర్వహించాలని అందులో కోరారు. కశ్మీర్‌లో హింసపై మొదటిసారి మోదీతో ఆమె శనివారం గంటపాటు భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ...  నిరసనకారుల ఆందోళనలు, ఆకాంక్షల పరిష్కారానికి తనకొక అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తిచేశారు. కశ్మీర్ లోయలో పోలీస్ స్టేషన్లు, ఆర్మీ శిబిరాలపై యువత దాడులు చేసేలా ప్రోత్సహిస్తున్న వారికి మద్దతును పాక్ ఆపాలన్నారు.

‘ 2002-2005 మధ్య వాజ్‌పేయ్ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రారంభించిన కశ్మీర్‌పై సయోధ్య, పరిష్కార పక్రియను పునరుద్ధరించాలి. సయోధ్య, పరిష్కార ప్రక్రియకు ప్రాణం పోయాలి. కశ్మీర్ ప్రజలు విశ్వసించే వ్యక్తులతో ఒక విభాగాన్ని ఏర్పాటుచేయండి.  అప్పుడే ఢిల్లీలో వారు చెప్పేది ప్రజలకు చేరుతుంది. పాక్ వెళ్లాలనే సాహస నిర్ణయం తీసుకున్న మోదీపై నాకు నమ్మకముంది’ అని మెహబూబా చెప్పారు.

పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టాలి
శాంతిని కోరుతున్న వర్గాల్ని చేరువవడమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు అన్ని పార్టీల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ‘సామాన్యుల ప్రాణాలు కాపాడేందుకు హురియత్ నేతలు సహా అన్ని పార్టీలు విభేదాలు పక్కనపెట్టి ముందుకు రావాలి. ప్రధాని మోదీ లాహోర్ పర్యటన, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌లో పర్యటించిన సమయంలో సయోధ్య కోసం లభించిన సువర్ణావకాశాన్ని పాక్ జారవిడుచుకుంది’ అని మెహబూబా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీర్‌పై ఐరాస తీర్మానానికి చోటులేదన్న పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ విధానాన్ని పాటించాలని సూచించారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ వాస్తవాల నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం వేర్పాటు వాదులతో పాటు, పాకిస్తాన్‌కు చర్చల్లో జోక్యం కల్పించాలని కార్యాచరణ ప్రణాళికలో మోహబూబా సూచించినట్లు సమాచారం.

 ఆగని అల్లర్లు
కశ్మీర్‌లో కొనసాగుతున్న హింసలో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిరసనకారులు, భద్రతా బలగాలకు మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో 25 మంది గాయపడ్డారు. నెలన్నర రోజులుగా కొనసాగుతున్న హింసాగ్నిలో మృతుల సంఖ్య 68కి పెరిగింది. చాలా ప్రాంతాల్లో ఇంకా కర్ఫ్యూ కొనసాగుతోంది. శనివారం సంగమ్ వద్ద ఝీలం నది నుంచి షానవాజ్ అనే యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు.

మరిన్ని వార్తలు