చరిత్రలో నిలిచిపోయేలా 'అమ్మ' స్మారకం

31 May, 2020 07:28 IST|Sakshi

మండపాన్ని జూలైలోగా పూర్తి చేయాలి 

నిర్మాణ పనులపై అధికారులతో సీఎం ఎడపాడి

సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకమండప నిర్మాణ పనులను ఈ ఏడాది జూలై నెలాఖరులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఆదేశించారు. ఈ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత 2016 డిసెంబర్‌ 5వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కు అంతిమ సంస్కారాలు నిర్వహించిన చెన్నై మెరీనాబీచ్‌ ఒడ్డున అందమైన సమాధి నిర్మాణం జరిగింది. ఆ తరువాత ఎంజీఆర్‌ సమాధి పేరొందిన పర్యాటక క్షేత్రంగా మారింది. ఎంజీ రామచంద్రన్‌ మరణం తరువాత అన్నాడీఎంకేకు విజయవంతంగా సారధ్యం వహించిన జయలలిత పార్దివదేహాన్ని సైతం చెన్నై మెరీనాబీచ్‌ ఒడ్డున ఎంజీఆర్‌ సమాధి పక్కనే ఖననం చేశారు. ఆ ప్రదేశంలో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ఎడపాడి ప్రభుత్వం నాడే ప్రకటించింది. చదవండి: జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే

నిర్మాణంలో అమ్మ స్మారక మండపం 

సముద్ర తీరాల్లో సమాధుల నిర్మాణంపై పర్యావరణ నిషేధం ఉన్నట్లు కొందరు వివాదాలు లేవనెత్తినా వాటిని అధగమించి రూ.5.08 కోట్ల అంచనాతో పనులు కొనసాగుతున్నాయి. జయ సమాధి డిజైన్‌ను చెన్నై ఐఐటీ రూపకల్పన చేయగా మధ్యప్రదేశాన్ని కాంక్రీట్‌తో పినిక్స్‌ పక్షి ఆకారంలో తీర్చిదిద్దుతున్నారు. అత్యంత క్లిష్టమైన నిర్మాణం కావడంతో ప్రజాపనులశాఖ అధికారులు పదేపదే పర్యవేక్షణ చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిర్మాణంలో కొంత జాప్యం కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిర్మాణానికి అవసరమైన వస్తువులను దుబాయ్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. లాక్‌డౌన్‌ రోజుల్లో సైతం ప్రత్యేక అనుమతి పొంది నిరవధికంగా పనులను సాగిస్తున్నారు.

ఇదిలా ఉండగా స్మారకమండప నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులను ముఖ్యమంత్రి ఎడపాడి రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. పనులు ఎంతవరకు వచ్చాయో వాకబు చేశారు. పనుల ప్రగతిని ఫొటోల ద్వారా సీఎంకు చూపించారు. చారిత్రాత్మక నిర్మాణంగా చరిత్రలో నిలవబోతున్న జయ స్మారక మండపం విషయంలో అత్యంత శ్రద్ధ చూపాలని సీఎం ఆదేశించారు. హడావిడికి తావివ్వకుండా నాణ్యత పాటించాలని సూచించారు. ఈ ఏడాది జూలై మాసాంతానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు.   చదవండి: టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి 

మరిన్ని వార్తలు