‘టెట్’ లీక్

23 Jun, 2014 02:20 IST|Sakshi
 • కొప్పల ట్రెజరీ నుంచి ప్రశ్నాపత్రాలు మాయం
 •  ఒక్కొ పేపర్ రూ. లక్ష చొప్పున విక్రయం
 •  విశ్రాంత ఉపాధ్యాయుడితో సహా 13 మంది అరెస్ట్
 •  పట్టుబడిన వారిలో పది మంది విద్యార్థులు
 • బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా 694 కేంద్రాలలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (టెట్) ఆదివారం జరిగాయి. పరీక్షలు జరగక ముందే బెంగళూరులో ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. ఇందుకు సంబంధించి కొప్పలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకుమార్ (65), అతని ఇద్దరుఅనుచరులతో సహ 13 మందిని బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.

  శనివారం కొప్పల ట్రెజరీ నుంచి ప్రశ్నా పత్రాలు తీసుకు వచ్చి ఒక్కొక్కటి రూ. లక్ష చొప్పున విక్రయించారు. కచ్చితమైన వివరాలు సేకరించిన సీసీబీ పోలీసులు ఆదివారం వేకువ జామున నందిని లే అవుట్‌లో ఉంటున్న నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన వారిలో పది మంది విద్యార్థులు ఉన్నారు. ప్రశ్న పత్రాలు లీక్ అయినా రాష్ట్ర వ్యాప్తంగా 694 కేంద్రాలలో 3.77 లక్ష మంది అర్హత పరీక్షలు రాశారు.  
   
  పెద్దల ప్రమేయంతోనే... : ఔరాద్కర్

  టెట్ ప్రశ్నాపత్రాల లీక్ వెనుక పెద్దల ప్రమేయం  ఉందని, ఈ ముఠాను అరెస్టు చెయ్యడానికి ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి గాలిస్తున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ తెలిపారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. టెట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన కేసులో ఇప్పటికే శివకుమార్‌తో సహ 13 మందిని అరెస్టు చేసినట్లు ధ్రువీకరించారు. వీరిని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నట్లు చెప్పారు.

  ప్రశ్నా పత్రాలు లీక్ కావడానికి ప్రధాన కారకులు ఎవరు? ఈ దందాలో ఎంత మంది ఉన్నారు, ఎన్ని చోట్ల ప్రశ్నాపత్రాలు విక్రయించారు? అనే విషయాలపై ఆరా తీస్తున్నట్లు వివరించారు.  కాగా, గతంలో ప్రశ్నా పత్రాల లీక్ కేసులో శివకుమార్‌ను అరెస్టు అయ్యాడని గుర్తు చేశారు. అయితే ఇతను ఇలాంటి పరీక్షలు జరిగే సమయంలో చాకచక్యంగా ప్రశ్నాపత్రాలు చోరీ చేసి పెద్ద మొత్తంలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడని తెలిపారు. శివకుమార్ వెనుక ఉన్న వారిని త్వరలో అరెస్టు చేస్తామని రాఘవేంద్ర ఔరాద్కర్ చెప్పారు.
   

మరిన్ని వార్తలు