బీడీడీ చాల్స్ పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతం

1 Jul, 2015 23:09 IST|Sakshi
బీడీడీ చాల్స్ పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతం

- టెండర్లు ఆహ్వానించిన ఎంహెచ్‌ఏడీఏ
- ఎం ఆదేశాల మేరకు మొదలైన పనులు
- మొత్తం 198 భవనాలకు మరమ్మతులు
సాక్షి, ముంబై:
నగరంలోని బాంబే డవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (బీడీడీ) చాల్స్ పునరుద్ధరణ ప్రక్రియను మహారాష్ట్ర గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్‌ఏడీఏ) వేగవంతం చేసింది. మాస్టర్ ప్లాన్ తయారు చేసేందుకు ఆసక్తి ఉన్న బిల్డర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. నగరంలోని నాయ్‌గావ్, వర్లీ, ఎన్.ఎం.జోషి మార్గ్ ప్రాంతాల్లో బీడీడీ చాల్స్ ఉన్నాయి. మొత్తం 86.98 హెక్టర్ల స్థలంలో ఉన్న 198 భవనాలను బ్రిటిష్ కాలంలో 1920-1925 మధ్య నిర్మించారు. ప్రస్తుతం వీటి కాలం చెల్లిపోవడంతో శిథిలావస్థ కు చేరుకున్నాయి. మరమ్మతు పనులకు రూ.140 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది పరిస్థితి. దాదాపు 16వేల కుటుంబాలు నివాసముంటున్నాయి.

ఎప్పుడు, ఏ రూపంలో ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. వర్షాకాలంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సిందే. ఈ నేపథ్యంలో వాటిలో నివాసం ఉంటున్న వారికి తాత్కాలికంగా మరోచోట పునరావసం కల్పించి చాల్స్‌ను పునరాభివృద్ధి చేయాలని ఎంహెచ్‌ఏడీఏనిర్ణయించింది. దక్షిణ ముంబైలోని అత్యంత కీలకమైన ప్రాంతంలో ఈ భవనాలు ఉండటంతో ఈ స్థలాలకు భారీ డిమాండ్ ఉంది. గత ప్రభుత్వాల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడిన చాల్స్ నివాసులకు బీజేపీ ప్రభుత్వం ఆదుకుంటామని తెలిపింది.

ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏప్రిల్‌లో జరిగిన ఓ సమావేశంలో బీడీడీ చాల్స్‌ను పునరాభివృద్ధి చేస్తామని సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. సీఎం ఆదేశాల మేరకు 195 చాళ్లను అభివృద్ధి చేసేందుకు ఎంహెచ్‌ఏడీఏ నడుము బిగించింది. ఇందుకోసం బిల్డర్లు, ఆర్కిటెక్చర్ల నుంచి టెండర్లను ఆహ్వానించింది. దశాబ్దాలుగా అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న బీడీడీ చాల్స్ నివాసులకు త్వరలో మంచి రోజుల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు