బస్ డిపోకు స్థలం

4 Aug, 2014 04:05 IST|Sakshi
బస్ డిపోకు స్థలం

 న్యూఢిల్లీ: మిలీనియం బస్ డిపోకు స్థల సేకరణలో మొదటి అడుగు పడింది. డీటీసికి రోహిణిలో 20 ఎకరాల స్థలాన్ని డీడీఏ అందజేసింది. డిపోను యమునానదీ తీర ప్రాంతం నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో దానికోసం కొత్త స్థలాన్ని వెతకడం మొదలుపెట్టారు. అయితే స్థల సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతూ వస్తోంది. డిపోకు సుమారు 60 ఎకరాల స్థలం అవసరం కాగా, ఒకే దగ్గర అంత స్థలాన్ని కేటాయించడం కష్టమని ఢిల్లీ అభివృద్ధి మండలి(డీడీఏ) తేల్చి చెప్పింది. దానికి బదులు మూడు ప్రాంతాల్లో స్థలాన్ని సేకరించి ఇస్తామని తెలిపింది. ఆ మేరకు ఉత్తర ఢిల్లీని రాణి ఖెరా ప్రాంత సమీపంలో 20 ఎకరాల స్థలాన్ని డీటీసీకి అప్పగించింది. ఈ మేరకు డీడీఏ ల్యాండ్ మేనేజ్‌మెంట్ శాఖ అధికారులు ఆదివారం డీటీసీ అధికారులను కలిసి సంబంధిత పత్రాలను అందజేశారు.
 
 కాగా, 2010లో కామన్‌వెల్త్ క్రీడలు జరిగిన సమయంలో యమునా నదీ తీరాన సుమారు 60 ఎకరాల స్థలంలో మిలీనియం డిపోను తాత్కాలిక పద్ధతిని అప్పటి ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ప్రారంభించారు. అయితే ఈ డిపో వల్ల యమునా పరీవాహక ప్రాంతం దెబ్బతింటోందని, వెంటనే దాన్ని అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ పలువురు పర్యావరణవేత్తలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో అధికారంలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మరో తొమ్మిది నెలల్లో మిలీనియం బస్ డిపోను అక్కడ నుంచి వేరేచోటికి మారుస్తామని కోర్టుకు విన్నవించారు. అనంతరం డిపోకు మూడు వేర్వేరు ప్రాంతాల్లో స్థలాన్ని కేటాయించగలుగుతామని కోర్టుకు డీడీఏ సమాధానమిచ్చింది. వాటిలో రోహిణి ప్రాంతమొకటి.
 
 సరాయ్ కాలే ఖాన్‌లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ (ఐడీటీఆర్) సంస్థ సమీపంలో, తూర్పు ఢిల్లీలోని కార్కారి మోరే వద్ద మిగిలిన స్థలాన్ని కేటాయిస్తామని తెలిపింది. కాగా, రాజ్ నివాస్‌లో ఇటీవల జరిగిన సమావేశంలో డీటీసీకి స్థలం కేటాయింపుపై చర్చించినట్లు డీడీఏ వైస్ చైర్మన్ బల్వీందర్ కుమార్ మీడియాకు తెలిపారు. కాగా, రోహిణిలో 20 ఎకరాల స్థలాన్ని తమకు డీడీఏ అప్పగించినట్లు డీటీసీ ప్రజా సంబంధాల అధికారి ఆర్.ఎస్. మిన్హాస్ తెలిపారు. మిగిలిన రెండు ప్రాంతాల్లోనూ స్థల కేటాయింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాని డీడీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఐడీటీఆర్‌ను వేరే స్థలానికి తరలించిన తర్వాత ఆ స్థలం ఆధీనంలో ఉన్న స్థలాన్ని డీటీసీకి అప్పగించనున్నట్లు ఆయన వివరించారు. అలాగే కార్కారీ మోరె ప్రాంతంలో స్థల సేకరణపైనా త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు.
 
 ఇదిలా ఉండగా, మెట్రో, మోనోరైలు వంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు ఎన్ని వచ్చినా డీటీసీ బస్సులు ఢిల్లీవాసుల జీవితంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతేగాక నగరంలో వాయు, ధ్వని కాలుష్యం తగ్గించాలంటే ప్రభుత్వ రవాణా వ్యవస్థను విస్తరించడం అత్యవసరం. అయితే ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉన్నా, డీటీసీ కొత్త బస్సులను కొనుగోలు చేయలేకపోతోంది. డిపోల్లో తగిన స్థలం లేకపోవడం, కొత్తవి నిర్మించేందుకు భూమి లభించకపోవడమే ఈ పరిస్థితికి కారణం. 800 బస్సులను నిలిపే వీలున్న మిలీనియం పార్క్ బస్సు డిపో యమునానది తీరంలో ఉన్నందున, వేరే చోటికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. యమునాదినది తీరాన్ని రక్షించేందుకు ఈ డిపోను తరలించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదిలా ఉంటే, ఢిల్లీ సమగ్ర బహుళ రవాణా వ్యవస్థ (డిమ్టస్) వద్ద ఉన్న వెయ్యి బస్సులను ఎక్కడ నిలపాలో తెలియని పరిస్థితి నెలకొంది.
 
 అయితే డిపో తరలింపుపై పర్యావరణవేత్తల్లోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నదీ పరివాహక ప్రాంతాన్ని రక్షించేందుకు దీనిని తరలించడం తప్పనిసరని అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త సునీతా నారాయణ్ మాట్లాడుతూ మిలీనియం బస్సు డిపోను తరలించాల్సిన అవసరం లేదన్నారు. దీనివల్ల నదీతీరానికి కలిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించి, డిపోను ఇక్కడే కొనసాగించవచ్చని చెప్పారు. అయితే డిపో తరలింపు అంత సులువుకాదని డీటీసీ అధికారులు అంటున్నారు. డిపోల స్థాపనకు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడానికి చాలా పెట్టుబడి, సమయం అవసరం అవుతుందని తెలిపారు.
 
 డిమ్టస్‌కు కూడా ఇప్పటికీ డిపోల నిర్మాణానికి స్థలం దొరకడం లేదు. సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్‌మెంట్‌కు చెందిన అనుమితా రాయ్ మాట్లాడుతూ డిపోల నిర్మాణం కీలకం కాబట్టి ఇందుకు బెంగళూరు విధానాన్ని అనుసరించడం మేలని అభిప్రాయపడ్డారు. తక్కువస్థలంలో ఎక్కువ బస్సులను నిలిపి ఉంచగలిగే డిజైన్లను అన్వేషించాలని సూచించారు. ఇదిలా ఉండగా, యమునా నదీ తీరం నుంచి మిలీనియం బస్ డిపోను తరలించిన తర్వాత అక్కడ ఒక పార్క్‌ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిసింది. అక్కడ ఇప్పటికే ఉన్న నిర్మాణాలను అలాగే ఉంచి వాటిని ప్రజల కోసం వినియోగించాలని గత జనవరిలో కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయించింది. అలాగే అక్కడ కొత్త కట్టడాలను వేటిని అనుమతించరాదని ప్రతిపాదించింది. అక్కడ ప్రజల కోసం ఒక పార్క్‌ను ఏర్పాటుచేస్తామని కేజ్రీవాల్ అప్పట్లో ప్రకటించారు.
 

>
మరిన్ని వార్తలు