మాటల యుద్ధం

28 Jun, 2014 02:51 IST|Sakshi
మాటల యుద్ధం

శాసనమండలిలో రాష్ట్ర విద్యారంగానికి సంబంధించి సభ్యులు లేవనెత్తిన పలు ప్రశ్నలకు మంత్రులు కిమ్మెన  రత్నాకర్, ఆర్వీ దేశ్‌పాండే సమాధానలిచ్చారు. విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లపై ఉన్న ఆరోపణలకు సంబంధించి మధుసూదన్ ప్రశ్నించినప్పుడు మాటల యుద్ధం కొనసాగింది. పరిస్థితి గందరగోళానికి దారితీయడంతో అధ్యక్షుడు శంకరమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.                        - సాక్షి, బెంగళూరు
 
 ప్రతి నియోజక వర్గానికి రూ.44 లక్షలు

 రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి నియోజక వర్గానికి రూ.44 లక్షలు విడుదల చేయనున్నట్లు మంత్రి కిమ్మెన రత్నాకర్ తెలిపారు. ఎమ్మెల్సీ రామచంద్రేగౌడ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ...  తమ ప్రాంతాల్లో పాఠశాల దుస్థితిని ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధులు బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన వాటికి అదనమని పేర్కొన్నారు.  ఇలా చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారని అన్నారు. మూడు నెలల్లోపు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన దాదాపు పూర్తి అవుతుందని అన్నారు. కాగా, రాష్ట్ర వ్యాపంగా 44,200 ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయని వివరించారు.
 
ఉప కులపతులపై ఆరోపణలు

రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల ఉప కులపతుల(వీసీ)పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మొత్తం 17 విశ్వవిద్యాలయాలు ఉండగా మాజీ, ప్రస్తుత వీసీలలో ఎనిమిది మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. వీరికి సంబంధించి దర్యాప్తు నివేదికలు అందిన వెంటనే పరిషత్‌లో ప్రవేశపెడుతామన్నారు.

గవర్నర్ ఆదేశాల మేరకు దర్యాప్తు జరిగిందని, ఆ నివేదిక ఇంకా అందలేదని పేర్కొన్నారు. దీంతో సభ్యులంతా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ అధికారి అవినీతి సంబంధించి రిపోర్టు అందలేదని చెప్పడం ప్రభుత్వ చేతకాని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇందుకు అధికార పక్షం అభ్యంతరం తెలిపారు. ఈ దశలో వాగ్వాదం చోటు చేసుకుని గందరగోళానికి దారితీసింది. చివరకు అధ్యక్షుడు శంకరమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

‘డీమ్డ్’ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం

డీమ్డ్ విశ్వవిద్యాలయాల వల్ల ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థులకు అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే అంగీకరించారు. అయితే ‘డీమ్డ్’కు అనుమతులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని, ఈ విషయంలో తాము ఏమీ చేయలేమని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎనిమిది డీమ్డ్ యూనివర్శిటీలు ఉన్నాయన్నారు. కాగా, వివిధ పథకాల కింద ప్రతి ఏడాది రాష్ట్రంలోని వైద్య, దంతవైద్య, ఇంజినీరింగ్ తదితర వృత్తి విద్య కోర్సులకు సంబంధించి దాదాపు 4,800 మంది విద్యార్థులకు ఉచితంగా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా