పా‘పాలు’

29 Jun, 2017 04:14 IST|Sakshi
పా‘పాలు’

ప్రైవేటు పాల ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్టు ధ్రువీకరణ అయ్యిందని పాడి, డెయిరీల అభివృద్ధి శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ స్పష్టంచేశారు. రెండు సంస్థల పాల ఉత్పత్తుల్లో గ్యాస్ట్రిక్, బ్లీచింగ్‌ పౌడర్‌ ఉన్నట్టు  నిర్ధారణ అయినట్టు తెలిపారు. కల్తీ వ్యవహారంపై తాను పెదవి విప్పితే చాలు విదేశాల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక, పాలల్లోకల్తీ వ్యవహారంలో మంత్రి వ్యాఖ్యలను తప్పుబడుతూ, అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్‌విరుచుకుపడటం గమనార్హం.
పాలలో రసాయనం కల్తీ ధ్రువీకరణ           
అన్నింటా కాదు.. కొన్ని మాత్రమేనని వివరణ
పరిశోధనలో తేటతెల్లమైనట్టు మంత్రి స్పష్టం         
♦  ఇంటి వద్దకే ఆవిన్‌ ఉత్పత్తులు    
బెదిరింపులు పెరిగినట్టు ఆందోళన          
డోర్‌ డెలివరీకి శ్రీకారం
రెండు సంస్థల గుట్టురట్టు చేసినట్టు ధీమా        
మంత్రిపై విరుచుకుపడ్డ అధికార ప్రతినిధి
సాక్షి, చెన్నై:
ప్రయివేటు పాలల్లో రసాయనాలు కలుపుతున్నట్టుగా మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఇటీవల సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పాల నమూనాలను పరిశోధనలకు పంపించినట్టు, నివేదిక రాగానే, చర్యలు తప్పదన్న హెచ్చరికలు చేశారు.

అయితే, పాలల్లో కల్తీ లేనట్టుగా ఆరోగ్య శాఖ ఓవైపు స్పందిస్తుంటే, మరోవైపు పాలల్లో రసాయనాలు ఉన్నాయంటూ మంత్రి స్పష్టంచేస్తూ రావడం చర్చకు దారితీసింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అసెంబ్లీలోనూ చర్చ సాగింది. తాను మాత్రం ఆ ప్రకటనకు కట్టుబడే ఉన్నట్టు, ప్రైవేటు పాల సంస్థలపై చర్యలు తప్పవని మంత్రి రాజేంద్ర బాలాజీ ధీమా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో బుధవారం ఆయన మరో ప్రకటన చేశారు. పరిశోధనల్లో రెండు సంస్థల ఉత్పత్తుల్లో రసాయనాలు ఉన్నట్టు ధ్రువీకరణ అయ్యిందని స్పష్టం చేశారు.

రసాయనాల గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని ఆవిన్‌ సంస్థ పాల ఉత్పత్తులను డోర్‌ డెలివరీ చేసే విధంగా ‘ఇంటి వద్దకే ఆవిన్‌’ నినాదంతో పంపిణీ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టారు. డోర్‌ డెలివరీ వాహనాలను జెండా ఊపి మంత్రి రాజేంద్ర బాలాజీ సాగనంపారు. అలాగే, ఆవిన్‌ ఒక లీటరు పెరుగు, ఒక లీటరు రసగుల్లా బాక్స్‌లను పరిచయం చేశారు. ఈసందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడుతూ, పాల కల్తీ వ్యవహారం గుట్టురట్టు అవుతున్నట్టు వివరించారు. తమకు అందిన ఫిర్యాదులు, తాము సేకరించిన వివరాల మేరకు కొన్ని పాల సంస్థల ఉత్పత్తులపై నిఘా వేశామని, వాటి నమూనాలను పరిశోధనలకు పంపించినట్టు గుర్తు చేశారు.

ప్రస్తుతం రెండు సంస్థల ఉత్పత్తుల్లో గ్యాస్ట్రిక్, బ్లీచింగ్‌ పౌడర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయిందని స్పష్టం చేశారు. చెడిపోయిన పాలను రిలయన్స్, నెస్లే సంస్థలు పౌడర్లుగా మార్చి మార్కెట్లోకి పంపుతున్నట్టు  ఆరోపించారు. చెడిపోయిన పాలల్లో ఆమ్లం ప్రభావం కనిపించకుండా గ్యాస్ట్రిక్, బ్లీచింగ్‌ పౌడర్లు కలుపుతున్నట్టు పరిశోధనలో నిర్ధారించామని తెలిపారు. చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థలో తాము జరిపిన పరిశోధనలో ఈ విషయం తేటతెల్లమైందన్నారు. ఈ గ్యాస్ట్రిక్, బ్లీచింగ్‌తో కూడిన పాల పౌడర్లను వాడడం వల్ల కడుపు నొప్పి, గుండె మీద ప్రభావం చూపించే సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. మరికొన్ని సంస్థల ఉత్పత్తుల మీద పరిశోధన జరుగుతోందన్నారు. అన్ని సంస్థలు కాదని, కొన్ని సంస్థల్లోనే ఈ కల్తీ సాగుతున్నట్టు స్పష్టం అవుతోందని చెప్పారు. ఆయా సంస్థల్లో కల్తీ విషయంగా తనిఖీల్లో  తాము పట్టుకుంటే, రూ.1,500 జరిమానా చెల్లించి తప్పించుకుంటున్నట్టు పేర్కొన్నారు. అందుకే ఈసారి జరిమానాతో కాకుండా, కఠిన చర్యలతో ముందుకు సాగనున్నామన్నారు.

పెదవి విప్పితే బెదిరింపులు
పాలల్లో రసాయనల ప్రస్తావన తాను తీసుకొచ్చినప్పుడల్లా తీవ్రస్థాయిలో బెదిరింపులు వస్తున్నాయని మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు. విదేశాల నుంచి కూడా బెదిరింపులు వస్తున్నట్టు, వీటికి తాను తలొగ్గే ప్రసక్తే లేదని, కల్తీకి పాల్పడుతున్న ఆయా సంస్థలపై చర్యలు తీసుకునే వరకు ఉపక్రమించబోనని స్పష్టంచేశారు. ప్రస్తుతం రెండు సంస్థల గుట్టురట్టు చేశామని, అయితే, దీనిని ఎవరూ నమ్మడం లేదని పేర్కొనడం గమనార్హం. కాగా, మంత్రి వ్యాఖ్యలను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించాల్సిన మంత్రి, రోజుకో సంచలన ప్రకటనతో కాలం నెట్టుకువస్తున్నారని విరుచుకుపడ్డారు. మంత్రి పనిగట్టుకుని చేస్తున్నట్టు అనుమానం కల్గుతోందని, పద్ధతి మార్చుకోని పక్షంలో కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం.

మరిన్ని వార్తలు