మర్మమేమిటో ? !

24 Jun, 2016 11:33 IST|Sakshi
మర్మమేమిటో ? !

జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా సంతోష్‌లాడ్   
నియామకంపై సర్వత్రా చర్చ
కాంగ్రెస్ తీరుపై విమర్శల వెల్లువ
 
బళ్లారి : బీజేపీ ప్రభుత్వ హయాంలో బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలు సాగుతున్నాయని అప్పటి ప్రతిపక్ష నేత సిద్దరామయ్య బెంగళూరు నుంచి బళ్లారి వరకు పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ గనులు తవ్వకాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి ఇవ్వడమే కాకుండా ఏకంగా బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బళ్లారి జిల్లా సండూరుకు చెందిన సంతోష్‌లాడ్‌కు సండూరులో వీఎస్ లాడ్ అండ్ కంపెనీలో భాగస్వామి. ఆయనకు సండూరులో అపారమైన గనుల నిల్వలు ఉన్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, పోరాటం చేసి, అధికారంలోకి వచ్చాక  అక్రమ గనులు తవ్వకాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంతోష్‌లాడ్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా కేబినెట్ హోదా కల్పించడంతో పాటు బళ్లారి జిల్లాకు ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడంతో కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి.
 
 రాష్ట్రంలో 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకివచ్చాక సిద్దరామయ్య మంత్రివర్గంలో సంతోష్‌లాడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. తర్వాత ఆయనపై అక్రమ గనుల తవ్వకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో మంత్రి పదవి నుంచి ఆరు నెలలకే తప్పించారు. ప్రస్తుతం సీఎం మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చేపట్టడంతో బళ్లారి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్న పరమేశ్వర్ నాయక్‌ను తప్పించి, ఆయన స్థానంలో సంతోష్ లాడ్‌కు మంత్రి పదవి కట్టబెట్టారు. పరమేశ్వర్ నాయక్ నిర్వహిస్తున్న కార్మిక శాఖనే సంతోష్ లాడ్‌కు అప్పజెప్పడంతో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నియమించడంతో గమనార్హం. అధికారంలో లేనప్పుడు పదే పదే అక్రమ గనుల తవ్వకాలపై ఆరోపణలు గుప్పి ంచిన సిద్దూ అధికారంలోకి వచ్చాక చేసిందేమిటని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
 
 బళ్లారి జిల్లాలో సీనియర్లతో పాటు యువ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే నిజాయితీ పరులుకు మంత్రి గిరి ఇవ్వక పోవడంతో అక్రమార్కుల కు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పదవి కట్టబెట్టారని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి
 

మరిన్ని వార్తలు