అమాత్యులు లేకపోయినా..

17 May, 2015 23:42 IST|Sakshi
అమాత్యులు లేకపోయినా..

- మంత్రుల బంగ్లాల్లో భారీ నీటి వినియోగం
- రూ. లక్షల్లో వస్తున్న బిల్లులు.. గత మూడేళ్లుగా ఇదే పరిస్థితి
- ఆర్టీఐ ద్వారా వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త చేతన్ కోటారి
సాక్షి, ముంబై:
మంత్రులు తమ బంగ్లాల్లో లేకపోయినా అక్కడ భారీగా నీటి వినియోగం జరుగుతున్న విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. పరిమితి లేకుండా నీటి వినియోగం జరుగుతుండటంతో రెండేళ్లుగా సరఫరా తగ్గించినా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. వివరాల్లోకెళితే మల్బార్‌హిల్స్‌లోని కొన్ని మంత్రుల బంగ్లాలలో ఎవ్వరూ లేకున్నా నీటి వినియోగం జరుగుతోంది. దీంతో ఈ బిల్లులు రూ. లక్షల్లో వస్తున్నాయి. నీటిని ఎవరు వినియోగిస్తున్నారో తెలియక సంబంధిత అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మంత్రుల బంగ్లాల్లోని 41 నీటి మీటర్లలో 18 పని చేయకున్నా వాడకం మాత్రం భారీగా జరుగుతోంది. గతేడాది 2014-15లో దాదాపు 22 బంగ్లాల్లో రూ. ఆరు లక్షలు బకాయిలు ఉన్నాయి. బిల్లులు చెల్లించని నగర ప్రజల నీటి సరఫరాను మాత్రం అధికారులు నిలిపి వేస్తున్నారు. తోర్న, శివ్‌గిరి, రాయల్‌స్టోన్, అజంత, డోంగిరి, రామ్‌టేక్ బంగ్లాల్లోని వాటర్ మీటర్లు పని చేయకపోయినా వాటి గురించి పట్టించుకోలేదు. కొన్ని బంగ్లాలు ఉపయోగంలో లేకున్నా నీటి ఉపయోగం మాత్రం కనిపిస్తోందని సంబంధిత అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బంగ్లాల చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ క్వాటర్స్‌ల్లోని వారు నీరు వినియోగిస్తున్నారా, లేక మధ్యలోనే చోరీ చే స్తున్నారా అనే వైపుగా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..
ఈ తాజా వైనం సామాజిక కార్యకర్త చేతన్ కోటారి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా వివరాలు సేకరించడంతో బయటపడింది. 2014-15లో అన్ని బంగ్లాలోని వాటర్ బిల్లులు రూ.42 లక్షలు వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. పురాతన్, జెట్‌వాన్ బాంగ్లాల్లో 2014-15లో రూ.లక్ష వరకు బిల్లులు ఉండగా, ఒక్క వర్షా బంగ్లాలోనే నీటి బిల్లు రూ.3.6 లక్షల వరకు జరిగింది. ముక్తా బంగ్లాలో రూ.2.8 లక్షలు, జెట్‌వాన్ రూ.2.1 లక్షలు, చిత్రకుట్ రూ.2.05 లక్షలు వచ్చాయి. ఇక 2012-13లో జట్వాన్ బంగ్లా నీటి బిల్లు రూ.5.7 లక్షలకు పైనే వచ్చింది. రామ్‌టేక్, చిత్రకుట్, సేవాసదన్ బంగ్లాలకు రూ.3.7 లక్షల నుంచి రూ.2.1 లక్షల నీటి బిల్లు వచ్చింది. మామూలుగా రెండు నెలల్లోగా నీటి బిల్లులను చెల్లించాలని, మీటర్లలో లోపం వల్ల జాప్యం జరుగుతోందని ప్రజా పనుల విభాగ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు