మంత్రి కుమారుని వీరంగం

17 Nov, 2013 01:12 IST|Sakshi
చెన్నై, సాక్షి ప్రతినిధి : మంత్రి కొడుకు మద్యం తాగి అతి వేగంగా కారు నడిపి వీరంగం సృష్టించిన సంఘటన చెన్నైలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. ఈ సంఘటనలో 17 ద్విచక్ర వాహనాలు ధ్వంసం కాగా వృద్ధురాలు తృటిలో ప్రాణాలు దక్కించుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
 
 చెన్నై నగరం శూలైమేడు గురుకలాన్ వీధిలోకి అర్ధరాత్రి 12 గంటల సమయంలో అత్యంత వేగంగా ఒక లగ్జరీ కారు దూసుకొచ్చింది. అదే వేగంతో రోడ్డుకు ఇరువైపులా పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేస్తూ ముందుకు సాగింది. ఈ శబ్దానికి శారద (65) ఇంటి నుంచి వెలుపలికి వచ్చింది. అదుపుతప్పిన ఆ కారు ఆమె వైపు రావడంతో ఒక్క ఉదుటున ఇంటిలోపలికి దూకేసింది. ఈ కేకలు విన్న పరిసరాల్లో ప్రజలు రోడ్లపైకి చేరారు. కారులోనే యువకుడు పరారయ్యేందుకు ప్రయత్నించగా ఆ వాహనం కింద రెండు బైకులు ఇరుక్కుపోవడంతో కొద్ది దూరంలో నిలిచిపోయింది.
 
 ప్రజలు పరుగున వెళ్లి యువకుని బయటకు లాగి దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా రెండుచేతులూ జోడించి ‘‘నేను మంత్రి కుమారుడిని, మీకందరికీ నష్టపరిహారంగా ఎంత డబ్బు కావాలంటే అంత ఇప్పిస్తాను, నన్ను కొట్టకుండా వదిలేయండి’’ అంటూ బతిమాలాడు. దీంతో ప్రజలు నిగ్రహం పాటించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జీపులో ఆ యువకుడిని తరలించిన పోలీసులు కారును కూడా తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులు వారందరినీ బెదిరించి తెల్లవారుజామున 5 గంటలకు కారును తీసుకెళ్లారు. 
 
 వేగంగా నా వైపుకు దూసుకొచ్చిన కారునుండి తృటిలో తప్పించుకున్నానని వృద్దురాలు శారద తెలిపింది. కారు ప్రమాదంలో తమ బైకులు బాగా దెబ్బతిన్నాయని చెబితే, వారేదో డబ్బులు ఇస్తారు, తీసుకుని మిన్నకుండమని పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డారని  స్థానికులు వాపోయూరు. సహజంగా తాము రోడ్డుపక్కనే పడుకుంటాము, రాత్రి వర్షం పడటంతో లోపలే ఉన్నాం. లేకుంటే తమ ప్రాణాలు పోయేవని మరో గృహిణి తెలిపింది. కేసు దర్యాప్తు చేస్తున్న పాండీబజార్ పోలీసులు మాట్లాడుతూ, కేకే నగర్‌కు చెందిన ఒక యువకుడు కారు నడిపాడని, అతను ఎవరనే సంగతి తెలియదని చెప్పారు. కేసును మాఫీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  
 
మరిన్ని వార్తలు