సీమాన్ సేన రెడీ!

16 Jun, 2015 09:19 IST|Sakshi
సీమాన్

ప్రప్రథమంగా అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు నామ్ తమిళర్ కట్చి సిద్ధమయింది. ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగడంతో పాటు పది నెలలకు ముందుగానే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
 
 
చెన్నై: శ్రీలంకలోని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా సినీ దర్శకుడు సీమాన్ నామ్ తమిళర్ ఇయక్కంను గతంలో ఏర్పాటు చేశారు. ఎల్‌టీటీఈ అధినేత వేలు పిళ్లై ప్రభాకరన్ ఆదర్శంగా, ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటూ, ఈ ఇయక్కం ద్వారా బహిరంగ సభల్లో ఆయన చేసే ప్రసంగం వివాదానికి దారితీస్తూ వచ్చింది. కేసుల మోత సైతం మోగాయి. అయినా, తగ్గని సీమాన్ తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇటీవల తన ఇయక్కంను రాజకీయ పార్టీగా ప్రకటించారు.
 
నామ్ తమిళర్ కట్చి పేరిట కార్యక్రమాలను విస్తృత పరుస్తూ వస్తున్నారు. ప్రధానంగా తమిళ ఈలం లక్ష్యంగా, తమిళుల అభ్యున్నతి నినాదంతో ముందుకు సాగుతున్న సీమాన్ మరో అడుగు ముం దుకు వేశారు. రాష్ట్రంలో ఏ పార్టీలతో పొత్తు తమకు అవసరం లేదని, తమిళులతోనే తమ మద్దతు అంటూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ప్రప్రథమంగా ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు రెడీ అయ్యారు. అలాగే, అసెంబ్లీ ఎన్నికలకు మరో పది నెలలకు పైగా సమయం ఉన్నా, దాంతో తమకు పని లేదంటూ, ఇప్పుడే తమ అభ్యర్థుల తొలి చిట్టాను ప్రకటించేశారు.
 
 సీమాన్ సేన రెడీ
కొద్ది రోజులుగా సీమాన్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు. తమిళాభిమానుల మద్దతు కూడగట్టుకునే విధంగా అక్కడక్కడ బిహ రంగ సభల్ని నిర్వహిస్తూ సంచనల, వివాదాస్పద వ్యాఖ్యలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం గూడువాంజేరిలో జరిగిన సభలో ఒంటరిగా అసెంబ్లీ ఎన్నికలకు తాము సిద్ధమని ప్రకటిస్తూ, తొలి విడతగా తొమ్మిది మందితో అభ్యర్థుల చిట్టాను విడుదల చేశారు. ఇందులో అత్యధికంగా న్యాయవాదులు ఉండటం గమనార్హం.
 
ఆ మేరకు నాగుర్‌కోయిల్-  కాకలై కుట్టుదళం,  శివగంగై - ఎలిల్ కుమార్, తిరువాడనై - రాజీవ్ గాంధీ అలియాస్ అరివు సెల్వం, షోళింగనల్లూరు - రాజన్, తిరుపత్తూరు - సినీ నిర్మాత కోట్టై కుమార్, మైలం- డాక్టర్ విజయలక్ష్మి, అంబత్తూరు - అన్భు తెన్నరసన్, గౌండం పాళయం - సినీ దర్శకుడు కార్వణ్ణన్, కుంభకోణం - మణి సెంథిల్ ఉన్నారు.  అసెంబ్లీ ఎన్నికల ఒంటరిగా సిద్ధం అయ్యామని, పట్టున్న చోట్ల మాత్రమే తమ పోటీ ఉంటుందంటూనే, తమిళుల కోసం  ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించాలన్న కాంక్షతో ముందుకు వెళ్తున్నామని సీమాన్ పేర్కొన్నారు.
 
రాష్ట్రంలోని కారాగారాల్లో పదిఏళ్లకు పైగా శిక్ష అనుభవిస్తున్న వాళ్లను క్రమ శిక్షణను పరిగణలోకి తీసుకుని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ పరిష్కారం కోసం జూలై పదిన మదురై, కోయంబత్తూరు, తిరుచ్చి, తిరునల్వేలి జిల్లా పాళయం కోట్టై, పుళల్ కారాగారాల ముందు ఆందోళనలు చేపట్టనున్నామని ప్రకటించారు. అలాగే, శ్రీలంక నుంచి వస్తున్న ఈలం తమిళుల్ని విచారణ పేరిట వేదించ వద్దని, ప్రత్యేక శిబిరాల్లో ఉన్న వాళ్లకు స్వేచ్ఛ కలిగించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు