దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా

1 Sep, 2016 12:45 IST|Sakshi
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
► ఫోర్జరీ పట్టాలు పుట్టించి భారీ కట్టడం 
► డీసీసీబీ బ్రాంచికి అద్దెకిచ్చిన వైనం l
► ఎమ్మెల్యే అనుచరుడి దురాగతం 
 
ఆకివీడు : ఆయనో అధికార పార్టీ నేత, ఆపై స్థానిక ప్రజా ప్రతినిధి అనుచరుడు. ఇంకేం తనకు తిరుగు లేదనుకున్నాడు. ఏకంగా రూ.3 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిపై కన్నేశాడు. అంతే.. ఆ భూమికి పట్టా పుట్టించి పలుకుబడితో పంచాయతీలో ప్లాన్‌ అప్రూల్‌ చేయించుకున్నాడు. ఆ భూమిపై హైకోర్టులో పిల్‌ నడుస్తుండటంతో భవన నిర్మాణం చకచకా పూర్తిచేసేశాడు. ఆ భవనాన్ని ప్రభుత్వ రంగ సంస్థ డీసీసీబీ బ్రాంచికే అద్దెకు ఇచ్చాడు.  

వివరాల్లోకి వెళ్లితే  మండలంలోని గుమ్ములూరు గ్రామ సర్పంచ్‌ కోపల్లె రత్నమాణిక్యం, ఉపసర్పంచ్‌ కోపల్లె సాయిబాబు ఆకివీడులోని గుమ్ములూరు వెళ్లే రోడ్డులో 2014లో 30 సెంట్ల భూమిని కొన్నారు. అదే ప్రాంతంలో పడమరవైపున రోడ్డు మార్జిన్‌లో తొమ్మిది సెంట్ల పోరంబోకు స్థలం ఉంది. ఈ స్థలానికి 2008లో పట్టా పుట్టించారు. రూ.మూడుకోట్ల విలువ చేసే ఆ స్థలంలో రెండంతస్తుల భవనం నిర్మించారు. భవనంలో కింది భాగాన్ని డీసీసీబీ బ్రాంచి కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. కబ్జా చేసిన స్థలంలో నిర్మించిన ఈ భవనాన్ని ఎమ్మెల్యే వి.వి.శివరామరాజు ప్రారంభించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి డీసీసీబీ చైర్మన్‌కూడా సహకరించారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ అండదండలతోనే ఈ వ్యవహారం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను పలువురు కోరుతున్నారు.   
 
దర్యాప్తునకు వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌
కబ్జాపై కలెక్టర్‌ స్పందించి తక్షణం విచారణ జరిపించాలని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు కేశిరెడ్డి మురళీ, మండల కన్వీనర్‌ గుండా సుందరరామనాయుడు, రూరల్‌ బ్యాంక్‌ డైరెక్డర్‌ నంద్యాల సీతారామయ్య, ఆకివీడు ఉపసర్పంచ్‌ షేక్‌ హుస్సేన్‌ తదితరులు డిమాండ్‌ చేశారు.  2014లో కొన్న స్థలం ముందు ఉన్న ప్రభుత్వ భూమికి  2008లో ఎలా పట్టా ఇచ్చారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అండదండలతోనే నకిలీ పట్టాలు పుట్టించారని విమర్శించారు.  
 
కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే..
హైకోర్టు ఉత్తర్వులకు లోబడే భవన నిర్మాణంపై పంచాయతీ తీర్మానం చేసింది. ప్లాన్‌ అప్రూవల్‌కు వచ్చినప్పుడు ఆ స్థలం పోరంబోకు స్థలమని నేను నోట్‌ రాశా. దీనిపై సర్వే చేయించాలని తహశీల్దార్‌ను కోరగా.. సర్వే చేయించి నాలుగు సెంట్ల భూమి పోరంబోకులో ఉందని రాతపూర్వకంగా తెలిపారు. కోపల్లె సాయిబాబు, రత్నంమాణ్యింల పేరున ఒకొక్కరికి రెండున్నర సెంట్లకు 2008లో పట్టాలు ఇచ్చారు. భవన నిర్మాణం ఏ ప్రాంతంలో జరిగిందో నాకు తెలీదు. సైట్‌ మ్యాప్‌ ప్రకారం ప్లాన్‌ అప్రూవల్‌ చేశారు. - ఎన్‌.ఠాగూర్, కార్యదర్శి, ఆకివీడు.
మరిన్ని వార్తలు