‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’

20 Sep, 2017 15:12 IST|Sakshi
‘స్పీకర్‌ది తప్పు.. సీఎంను మార్చాలన్నారంతే..’

మద్రాస్‌ : పద్దెనిమిదిమంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్‌ అనర్హత వేటు వేయడం సహజ న్యాయానికి విరుద్ధం అని అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్‌ తరుపు న్యాయవాది దుష్యంత్‌ దవే బుధవారం మద్రాస్‌ హైకోర్టుకు విన్నవించారు. ఎమ్మెల్యేలు పార్టీకి విరుద్ధంగా ఏమీ చేయలేదని, వారు కేవలం నాయకత్వ మార్పును మాత్రమే కోరుకున్నారని, అవినీతిపరుడైన పళనీస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని అడిగారని, ఇది పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాదని చెప్పారు. దినకరన్‌ వైపు ఉండిపోయిన అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేలపై తమిళనాడు స్పీకర్‌ వేలు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తొలుత దినకరన్‌ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. కోర్టుకు ఆయన ఏం చెప్పారంటే..

‘18మంది ఎమ్మెల్యేలపై వేలు వేస్తు తమిళనాడు స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయానికి విరుద్థం. పార్టీకి విరుద్ధంగా ఎమ్మెల్యేలు ఏం చేయలేదు. వాళ్లు నాయకుడిని మాత్రమే మార్చాలని కోరారు. వారు వేరే పార్టీలోకి వెళ్లలేదు.. దీని ప్రకారం వారి చర్య పార్టీ ఫిరాయింపు పరిధిలోకి రాదు. గవర్నర్‌కు వారు ఇచ్చిన లేఖలో కూడా ముఖ్యమంత్రిని మార్చాలనే అడిగారు. ఆ పద్దెనిమంది ఎమ్మెల్యేలకు కనీసం సమయం కూడా ఇవ్వలేదు. మూడు వారాల్లో త్వరత్వరగా మొత్తం కానిచ్చేశారు. ఎమ్మెల్యేలపై వేటు వేశారు’ అని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం స్పీకర్‌ తరుపు న్యాయవాది వాదనలు చేస్తూ స్పీకర్‌ నిర్ణయం సరైనదే అన్నారు. చట్టప్రకారమే ఆయన వ్యవహరించారని తెలిపారు.