కొల్హాపూర్‌లో ఉద్రిక్తత

13 Aug, 2013 23:41 IST|Sakshi

సాక్షి, ముంబై: కొల్హాపూర్‌లో రెండున్నరేళ్ల బాలికపై జరిగిన అత్యాచారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఆఘాయిత్యానికి పాల్పడింది జార్ఖండ్ వాసి కావడంతో రెచ్చిపోయిన శివసేన, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ కార్యకర్తలు నగరంలోని మరాఠేతరులపై సోమవారం రాత్రి దాడికి దిగారు. వారు నిర్వహిస్తున్న దుకాణాలు, తోపుడు బండ్లను ధ్వంసం చేశారు. కర్రలతో ఎవరు కనబడితే వారిని చితకబాదారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని తెలిసింది. వివిధ వాహనాలు, తోపుడు బండ్లు, ఇళ్లలోని వస్తువులతోపాటు ఆస్తినష్టం వాటిల్లింది. ఈ విషయం స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది.
 
 కొల్హాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్‌పోర్ట్ (కేఎంటీ) బస్సులపై  మంగళవారం కూడా దాడులు జరిగాయి. పలు ప్రాంతాల్లో బంద్ నిర్వహించారు. అనేక ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్న సమయంలో ఈ కొల్హాపూర్ ఘటనతో మరోసారి మరాఠీ, మరాఠేతరుల అంశం వేడేక్కె అవకాశాలు ఏర్పడ్డాయి. కాగా, కొల్హాపూర్ లక్ష్మితీర్థ్ పరిసరాల్లో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో రెండేళ్ల నాలుగు నెలల బాలికపై ఓ కామాందుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బాలిక అరుపులు విన్న ఇరుగుపొరుగువారు రాజేష్‌సింగ్ బబుల్‌సింగ్ (30)ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే ఈ విషయం ఒక్కసారిగా నగరవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో స్థానికులు కోపోద్రిక్తులయ్యారు. అత్యాచారానికి పాల్పడిన కామాందుడు జార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా తెలిసింది. నిందితుడు మరాఠేతరుడని తెలిసిన వెంటనే మరాఠేతరులపై శివసేన, ఎమ్మెన్నెస్ కార్యకర్తలు దాడులకు దిగారు.  సోమవారం అర్ధరాత్రి వరకు దాడులు జరిగాయి.
 
 మరాఠేతరుల వాహనాలు, తోపుడు బండ్లను ధ్వంసం చేశారు. ఇంతటితో ఆగకుండా పలువురిని చితకబాదారు. ఇళ్లల్లో చొరబడి మరి దాడులు చేశారు. ఈ ఘటనలో గాయపడిన వారందరూ చిన్నచితక కూలి పనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్న మరాఠేతర కార్మికులే. దీంతో ఒక్కసారిగా మరాఠేతరులందరు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న కొందరు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అత్యాచారం సంఘటన తో తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమపై దాడులు జరపడంపై ఎంతవరకు సమంజసమని కొందరు మరాఠేతరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు