37 కేసులున్న మోదీని అరెస్ట్ చేశారా?

14 Jul, 2016 02:14 IST|Sakshi
37 కేసులున్న మోదీని అరెస్ట్ చేశారా?

ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్షద్ వ్యాఖ్యలు
అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం

 

బెంగళూరు: ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్షద్ శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలు అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీశాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశంపై శాసనమండలిలో బుధవారం చర్చ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ....‘ప్రధానమంత్రి నరేంద్రమోదీపై దాదాపు 37 కేసులున్నాయి. కొంత మంది తాము చనిపోతూ తమ చావుకు నరేంద్రమోదీనే కారణం అని కూడా చెప్పారు. అంతమాత్రాన నరేంద్రమోదీని అరెస్ట్ చేశారా?’ అని ప్రశ్నించారు. దీంతో శాసనమండలిలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఈశ్వరప్ప, ఇతర బీజేపీ సభ్యులు రిజ్వాన్ అర్షద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిచారు. ‘మీ పార్టీ నాయకుల పైన కూడా చాలా కేసులున్నాయి’ అంటూ రిజ్వాన్ అర్షద్ పై విమర్శలకు దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రిజ్వాన్ అర్షద్‌కు అండగా నిలిచారు. ‘కొత్తగా ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించారు, వారిని మాట్లాడనివ్వండి’ అని కోరారు. దీంతో శాసనమండలి చైర్మన్ డి.హెచ్.శంకరమూర్తి కలగజేసుకుంటూ ‘ఈ సభలో సభ్యులు కాని వారి పేర్లను ఇక్కడ ప్రస్తావించకండి. కేవలం వారి హోదాను మాత్రమే పేర్కొంటూ మాట్లాడండి’ అని రిజ్వాన్ అర్షద్‌కు సూచించారు.

దీంతో రిజ్వాన్ అర్షద్ మరోమారు మాట్లాడుతూ....‘ పదేళ్లుగా రాష్ట్రంలో 122 మంది పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత బీజేపీ ప్రభుత్వ సమయంలోనూ బళ్లారిలోని ఓ ఎస్పీ మంత్రి కాలికి ఉన్న షూ లేస్ కడుతున్న ఫొటోలు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. అంతెందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాపై కూడా అనేక కేసులున్నాయి. ఆయన రాజీనామా ఇచ్చారా’ అని పేర్కొన్నారు. దీంతో మరోసారి అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. అనంతరం మండలి చైర్మన్ శంకరమూర్తి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కాగా, డీఎస్పీ గణపతి ఆత్మహత్య అంశానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కె.జె.జార్జ్ ఈ అంశంపై శాసనమండలిలో బుధవారం వివరణ ఇచ్చారు. ఈ సందర్భంలో మరోమారు అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చెలరేగింది. దీంతో శాసనమండలిలో అధికార పక్ష నేత డాక్టర్ జి.పరమేశ్వర్ కలగజేసుకొని ‘మంత్రి మండలి సమావేశం ఉంది. ఈ అంశంపై గురువారం ఉదయం సమాధానం ఇస్తాం’ అని చెప్పడంతో ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

‘సభకు వివరణ ఇవ్వాల్సింది పోయి, ఏవో సాకులతో పలాయనం  చిత్తగిస్తున్నారు, సభా కార్యకలాపాలను మీరెంత నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. మీ మంత్రి మండలి సమావేశాన్ని కావాలంటే వాయిదా వేసుకోండి, ముందు సభకు సమాధానం చెప్పి వెళ్లండి’ అంటూ విపక్షాలు పరమేశ్వర్‌ను నిలదీశాయి. ఈ సందర్భంలో పరమేశ్వర్ మాట్లాడుతూ....‘ప్రతిపక్షాలు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు, మండలి చైర్మన్ ఈ విషయంలో కలగజేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలి’ అని కోరారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ శంకరమూర్తి విపక్షాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.
 
 

మరిన్ని వార్తలు