‘సత్యమేవ జయతే..’లో మోహన్‌లాల్

23 Feb, 2014 02:00 IST|Sakshi
‘సత్యమేవ జయతే..’లో మోహన్‌లాల్


 
 న్యూఢిల్లీ: ఇది వరకే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆమిర్‌ఖాన్ టీవీ షో తేసత్యమేవ జయ తాజా భాగం దక్షిణాదిలోనూ సంచలనం సృష్టించేలా చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

అందుకే దక్షిణాదిలో బాగా జనాదరణ ఉన్న హీరోల్లో ఒకరైన మోహన్‌లాల్‌ను రంగంలోకి దింపుతున్నారు. సామాజిక అంశాలు నేపథ్యంగా 2012లో వచ్చిన సత్యమేవ జయతే దేశవిదేశాల్లోనూ సంచలనం సృష్టించడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి లాల్‌ను ప్రచారకర్తగా నియమించడం వల్ల దక్షిణాదిలో వీక్షకుల సంఖ్య బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. షోలో ఆమిర్ లేవనెత్తే పలు అంశాలపై లాల్ మాట్లాడుతారు. స్టార్‌టీవీ నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ మలయాళ హీరో అన్నారు. ఈ కొత్త తరహా షోలో దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై విపులంగా చర్చిస్తామని అన్నారు.

 

ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. సత్యమేవ జయతే షో కోసం తీస్తున్న ప్రచార వీడియోల షూటింగ్‌లోనూ లాల్ చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలాంటి భారీ నటుడు షోలో కనిపించడం వల్ల ఇది మరింత మందికి చేరుతుందని స్టార్‌ఇండియా సీఈఓ ఉదయ్‌శంకర్ అన్నారు. క్రితం సారి కూడా సత్యమేవ జయతే పలు సామాజిక దురాచారాలు, సమస్యలపై విపులంగా చర్చించి దేశవ్యాప్తంగా సంచనాలను నమోదు చేసింది. ఇక దీని రెండో భాగం వచ్చే నెల రెండు నుంచి ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. స్టార్‌గ్రూపు చానెళ్లు స్టార్‌ప్లస్, స్టార్ ప్రవాహ్, స్టార్ విజయ్, స్టార్ ఉత్సవ్‌తోపాటు దూరదర్శన్‌లో ఈ షో ప్రసారమవుతుంది. తెలుగు చానెల్ ఈటీవీలో మధ్యాహ్నం ఒంటిగంటకు సత్యమేవ జయతేను చూడవచ్చని స్టార్ వర్గాలు తెలిపాయి.
 
 

మరిన్ని వార్తలు