ఆత్మరక్షణలో అమ్మ ప్రభుత్వం

4 Aug, 2015 04:30 IST|Sakshi

టాస్మాక్ దుకాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబుకిన వ్యతిరేకత, అన్ని ప్రతిపక్షాలతోపాటు ప్రజలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఏకం కావడం అమ్మ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జయలలిత సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు.
 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: గత కొంతకాలంగా చాపకింద నీరులా ఉండిన సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్ గాంధేయవాది శశిపెరుమాళ్ ఆకస్మిక మరణంతో ఒక్కసారి భగ్గున లేచింది. కాంగ్రెస్, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వామపక్షాలు, బీజేపీ ఇలా అన్ని పార్టీలు మద్యం అమ్మకాలపై సమరశంఖం పూరించాయి. విపక్షాలు చేసే ఆందోళనలను తిప్పికొట్టగల సమర్దత గలిగిన ముఖ్యమంత్రి జయలలిత ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంతో ఆమె ఇరుకునపడ్డారు. మద్యం దుకాణాల కారణంగా ప్రజాగ్రహానికి గురైతే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కాగలవనే ఆందోళన ఆమెలో నెలకొంది. శశిపెరుమాళ్ మరణం తరువాత రోజు రోజుకూ టాస్మాక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగిపోతున్న పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం సచివాలయంలో జయ సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, డీజీపీ అశోక్‌కుమార్, శాంతి భద్రతల విభాగం ఏడీజీపీ రాజేంద్రన్ తదితరులతో పరిస్థితిని సమీక్షించారు.
 
 వైగోపై 12 కేసులు:
  ఇదిలా ఉండగా, మద్యంపై పోరుకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎండీఎంకే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోపై ప్రభుత్వం 12 కేసులు బనాయించింది. శంకరన్‌కోవిల్ కలింగపట్టిలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆందోళన చేసిన వైగో సహా 52 మందిపై ప్రభుత్వం కేసులు బనాయించింది. వైగో సొంతూరైన తిరునెల్వేలీ కలింగపట్టిలో టాస్మాక్‌దుకాణాలపై ఆయన యుద్దం ప్రకటించారు. ఈ సందర్భంగా టాస్మాక్ అధికారులపై వైగో దాడిచేశారని ఆరోపిస్తూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శశిపెరుమాళ్ చనిపోయిన నాటి నుండి ఆందోళనలు సాగిస్తున్నారు. ప్రజా పోరాటాన్ని అన్నాడీఎంకే ప్రభుత్వం అడ్డుకోవడమేగాక కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వైగో విమర్శించారు. అక్రమ కేసులను బనాయించడమేగాక తనను శాశ్వతంగా అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు.
 
 వైగో తదితరులపై 12 కేసులు బనాయించడంతో నెల్లై జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
 నేడు రాష్ట్రబంద్:  రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరుతూ ముందుగానే ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నారు. ఎండీఎంకే, వీసీకే, మనిదనేయ మక్కల్ కట్చి పార్టీలు ఈనెల 4వ తేదీన బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించారు.
 
 10న డీఎంకే ఆందోళన: కరుణ
 మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 వ తేదీన రాష్ట్రవ్యాప్త అందోళన చేపడుతున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి సోమవారం ప్రకటించారు. డీఎంకే అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని తానిచ్చిన మాటకు కట్టుబడివ ఉన్నానని ఆయన అన్నారు. మద్యనిషేధం కోరుతూ ప్రజలు జరుపుతున్న పోరాటాన్ని పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
 

మరిన్ని వార్తలు