మోనో.. రయ్..రయ్..!

1 Feb, 2014 23:24 IST|Sakshi

 సేవలు ప్రారంభం  నేటినుంచి పూర్తిస్థాయి అందుబాటులోకి..
 
 సాక్షి, ముంబై: ముంబై వాసుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. తాజాగా మోనో రైలు సేవలు ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్యనుంచి కూడా ప్రజలకు ఊరట లభించనుంది. చెంబూర్-వడాలా మోనో మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఏసీ బోగీల్లో తక్కువ ఖర్చుతోనే ప్రయాణించేందుకు వీలుపడనుంది.  
 
 పర్యాటకులకు పండుగే..
 దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన మోనో రైలు సేవలు తొందర్లోనే పర్యాటకుల డెస్టినేషన్‌గా మారనున్నాయని చెప్పవచ్చు.  అనేక సంవత్సరాలుగా మోనో రైలును చూడాలని కలలు గంటున్న ముంబైవాసులతోపాటు ముంబైకి వచ్చే పర్యాటకులు మోనోరైలు ప్రయాణాన్ని ఒక్కసారైనా ఆస్వాదించాలని ఆరాటపడే అవకాశాలున్నాయి. ముఖ్యంగా టెస్ట్ డ్రైవ్ సమయంలో కూడా ఈ రైలు పై నుంచి వెళ్లే సమయంలో కిందకు చూస్తే రోడ్లపై రద్దీ కన్పించేది. అదేవిధంగా ఈ రైలు వెళ్తుండగా ఫొటోలు, వీడియోలు తీస్తూ జనాలు ఆనందించడం కనిపించింది. కాగా, ఆదివారం నుంచి మోనో రైలు అందుబాటులోకి రానుందని తెలిసి పెద్ద ఎత్తున ప్రజలు దీనిలో ప్రయాణించేందుకు చెంబూర్, వడాలాతోపాటు ఇతర మోనో రైల్వేస్టే షన్లకు చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.  
 
 సీజన్ పాసుల్లేవ్.. !
 లోకల్ రైళ్ల మాదిరిగా మోనోరైలులో నెలసరి సీజన్ పాస్‌లుండవని తెలిసింది. కేవలం స్మార్ట్ కార్డు లేదా కూపన్‌ను వినియోగించుకోవాల్సి వస్తుంది. ప్రారంభంలో రూ. 150 కూపన్ తీసుకున్నట్టయితే రూ. 100 డిపాజిట్‌గా ఉంచుకుని రూ. 50 ప్రయాణికులు వినియోగించుకునేందుకు వీలుకల్పించనున్నారు. అనంతరం ఈ కార్డులో డబ్బులు రీచార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. అదే విధంగా మోనో రైల్వేస్టేషన్లలోని మొదటి అంతస్తులో ఉండే టిక్కెట్ కౌంటర్‌లో డబ్బులు చెల్లించిన అనంతరం నాణం ఆకారంలో ఉండే కూపన్  ఇస్తారు. ఈ కూపన్‌నుగేట్‌లో వేస్తే ఫ్లాట్‌ఫారంలోపలికి ప్రవేశం లభించనుంది.
 
 ‘మోనో’ కోసం బస్ట్ బస్సులు: మోనోరైలు సేవలు ప్రారంభంలోకి రాగానే ఆయా రైలుస్టేషన్ల నుంచి ప్రతి 15 నిమిషాలకు బెస్ట్ బస్సు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. మోనోరైలు స్టేషన్ల నుంచి తాము బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని బెస్ట్ అధికారి తెలిపారు. ఈ సందర్భంగా బెస్ట్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ.. మోనో రైలు సేవలు ప్రారంభం కాగానే చాలా మంది నగర వాసులు ‘జాయ్ రైడ్’ కోసం మోనోరైలును సందర్శిస్తారన్నారు. దీంతో తాము కూడా వడాలా రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆయన తెలిపారు. ప్రారంభంలో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి షటిల్ సేవలను నడపనున్నట్లు తెలిపారు.
 
 రవాణావ్యవస్థలో కొత్త శకం..
 
 సాక్షి, ముంబై: దేశరవాణా వ్యవస్థలో కొత్త ఆధ్యాయం ప్రారంభమైంది. దేశంలోని తొలి రైలు ముంబై - ఠాణేల మధ్య 1853లో ప్రారంభమైన విషయం తెలిసిందే. అనంతరం దేశవ్యాప్తంగా రైల్వే సేవలను విస్తరించారు. అప్పటినుంచి రైల్వే వ్యవస్థలో ఎన్నో మార్పులుచేర్పులు జరిగాయి. కాగా, 161 సంవత్సరాల అనంతరం దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం మోనో రైలు రూపంలో ప్రారంభమైంది. ఈ సేవలు కూడా ముంబైలోనే ప్రారంభ ం కావడం విశేషం. దేశ ఆర్థిక రాజధానిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న ప్రయత్నంలో భాగంగానే ఈ రైలు సేవలను ప్రారంభించారు. రాబోయే రోజుల్లో మెట్రో రైలు సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. వీటికి తోడు జలరవాణాను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతుండటం గమనార్హం.

మరిన్ని వార్తలు