‘మోరల్ పోలీసింగ్’ కేసులో మలుపు

14 Aug, 2015 02:00 IST|Sakshi
‘మోరల్ పోలీసింగ్’ కేసులో మలుపు

ముంబై : మధ్ ఐలాండ్ మోరల్ పోలీసింగ్ కేసు మలుపు తిరిగింది. మాల్వణీ పోలీసులకు స్థానికులు మద్దతుగా నిలిచారు. దాడుల్లో పాల్గొన్న పోలీసు అధికారులను బదిలీ చేస్తే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నివాసం ఎదుట ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పోలీసులు తనిఖీ నిర్వహించడంతో ఇప్పుడు తాము సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామని, రాక్షసుల కళ్ల నుంచి తమ ఆడవాళ్లు బయటపడినట్లుగా ఉందని అంటున్నారు. ‘పోలీసుల తీరును ఖండిస్తూ పత్రికలు రాయడం బాధించింది. పోలీసులు మాకు మద్దతుగా నిలిచారు.

ఒకవేళ బాధ్యత సక్రమంగా నిర్వహించినందుకు పోలీసులపై చర్యలు తీసుకుంటే వారికి మేము మద్దతుగా నిలుస్తాం. ఆ అధికారులను బదిలీ చేస్తే సీఎం నివాసం ఎదుట ఆందోళన చేపడతాం’ అని ఉత్తర  ముంబైలోని మలాడ్‌లో మధ్ గ్రామ నివాసి నరేశ్ జాదవ్ హెచ్చరించారు. ‘ఈ మోరల్ పోలీసింగ్ అనే అంశం లేవనెత్తడం వెనక హోటళ్ల యజమానులు ఉన్నారు. ఎందుకంటే ఈ దాడుల వల్ల వారి వ్యాపారం దెబ్బతిన్నది. అందుకే ఇలా చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు సకాలంలో దాడులు చేశారు’ అని జాదవ్ అన్నారు. ‘హోటళ్లు, లాడ్జీలు, కాట్టేజీల్లో వ్యభిచారం పెరిగిపోయింది.

దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఐదేళ్లలో పోలీసులకు ఎన్నో సార్లు లేఖలు రాశాం. గతంలో మా ఆడవాళ్లు బయటకు తల వంచుకుని వెళ్లేవాళ్లు. ఇప్పుడు పోలీసుల దాడుల తర్వాత స్వేచ్ఛగా తిరుగుతున్నారు. వారికి థ్యాంక్స్ చెబితే సరిపోదు’ అని డోంగార్‌పాడా గ్రామంలో నివసించే రాకేశ్ రాజ్‌పుత్ అన్నారు. మధ్ ఐలాండ్, ఆక్సా ప్రాంతాల్లో ఆగస్టు 6న పోలీసులు జరిపిన దాడుల్లో 13 జంటలతో పాటు మరో 35 మంది అరెస్టయ్యారు. ఈ వ్యవహారంపై 9వ తేదీన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా విచారణకు ఆదేశించారు. ‘పోలీసులు చేసిన పనిని అభినందించాలి.

వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకుని వారు మంచి పనిచేశారు’ అని కన్సారీ మాతా ఆదివాసీ సమాజ్ సేవా సంఘ్ అధ్యక్షులు రేణుకా దివే అన్నారు. దాడులు జరిపిన గ్రామాలు ఏ ప్రాంత పరిధిలో వస్తాయో తెలపాలని కోరుతూ మాల్వణీ పోలీస్ స్టేషన్‌కు లేఖ కూడా రాశామని, అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకోవాలని కోరామని చెప్పారు. కానీ ఈ విషయంపై ఎవరూ స్పందించలేదని ఆరోపించారు. ‘ఆటో రిక్షా వాళ్లతో లాడ్జీలు, హోటళ్ల వాళ్లు కుమ్మక్కై వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారని స్థానికులు చెప్పారు. అలా చేస్తున్న ఆటో రిక్షాలపై నిఘా ఉంచాలని పోలీసులను కోరాం. అలాగే ఈవ్ టీజింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పాం’ అని దివే పేర్కొన్నారు.

 అప్పుడే ఫిర్యాదులు అందాయి..
 ‘ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కొన్ని నెలల క్రితమే కాంగ్రెస్ ఎమ్మెల్యే అస్లాం షేక్ పోలీసులను కోరారు. మధ్ ఐలాండ్‌లోని డొంగార్‌పాడా, ఆక్సా, ఢార్వలీ గ్రామాల ప్రజలు కూడా పోలీసులకు పలు మార్లు విజ్ఞప్తి చేశారు. మొత్తం వ్యవహారానికి సంబంధించి కొందరు మహిళలను అరెస్టు చేశాం. వారు ముంబైలోని పలు ప్రాంతాల్లో వ్యభిచార గృహాలను నడుపుతున్నట్లు తెలిసింది’ అని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.

మరిన్ని వార్తలు