అర్ధరాత్రి వేళ మరిన్ని ఆటోలు

2 Aug, 2013 03:05 IST|Sakshi

సాక్షి, ముంబై: నగరంలో రాత్రి వేళ ప్రయాణించేవారి సౌకర్యార్థం మరో 15 వేల ఆటోలు నడవనున్నాయి. రాత్రి వేళ్లలో బస్సులు, రైలు సేవలు నిలిచిపోయిన తర్వాత చాలామంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో మంత్రాలయ వర్గాలు రాత్రి పొద్దుపోయేవరకు కూడా ఆటోలను నడిపేందుకు అనుమతించారు. ఈ మేరకు రవాణా మంత్రిత్వ శాఖ ఆటో డ్రైవర్లకు రెండేళ్ల కోసం తాత్కాలికంగా బ్యాడ్జీలను జారీ చేయనున్నట్లు ఆర్టీవో అధికారి ఒకరు తెలిపారు. వీటి గడువు ముగిసినప్పటికీ పునరుద్ధరించుకోవచ్చని తెలిపారు. బ్యాడ్జీలకు దరఖాస్తు చేసుకోదలచినవారు కనీసం రెండేళ్ల డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండాలన్నారు. కాగా, కొత్త డ్రైవర్లకు బ్యాడ్జీలను జారీ చేయడం ద్వారా డ్రైవర్ల సంఖ్య పెరిగి, రాత్రి వేళ్లలో కూడా ఆటోలను నడిపేందుకు ఆస్కారం ఉంటుంది.
 
 కాగా, ఆటో యూనియన్ నాయకుడు థాంపి కురేన్ ఈ ప్రతిపాదనను స్వాగతించారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లోనే చాలా మంది ప్రయాణికులు ఆటోలపై ఆధారపడుతుంటారని తెలిపారు. రైళ్లు రాత్రి 2 గంటల వరకు నడుస్తుంటాయి. వారికి ప్రత్యామ్నాయ ప్రయాణసాధనంగా ట్యాక్సీలు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటాయని థంపే తెలిపారు. ప్రయాణికులకు రాత్రి సమయాల్లో గమ్యస్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ, దీంతో రాత్రి వేళ్లలో కూడా మరిన్ని ఆటోలు నడిపేందుకు అనుమతినివ్వాలని రవాణా శాఖ మంత్రి సచిన్ ఆహిర్‌ను ఇటీవలనే కోరినట్లు థంపే వివరించారు. అంధేరి వాసి అంజు చోప్రా మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో  ఆటోల కొరత ఎక్కువగా ఉందన్నారు.

మరిన్ని వార్తలు