అక్కడ హిజ్రాలను దేవతలుగా పూజిస్తారు

27 Jul, 2016 14:01 IST|Sakshi
అక్కడ హిజ్రాలను దేవతలుగా పూజిస్తారు

దేవనిపట్టినమ్: తమిళనాడులోని దేవనిపట్టినమ్ చేపల వేటపై బతికే ఓ చిన్న గ్రామం. అక్కడ దుర్భర జీవితాన్ని అనుభవించే హిజ్రాలను కోఠీలని, కిన్నార్లని, అరవాణిలని ప్రాంతాలనుబట్టి పిలుస్తారు. వారు ఏడాదిలో పది రోజులు మినహా మిగతా అన్ని రోజుల్లో అడుక్కుతింటూ లేదా కూలినాలి చేసుకుంటూ జీవనం సాగిస్తారు. వారి పట్ల తోటి సమాజం పెద్ద గౌరవం కూడా చూపదు. ఏడాదిలో పది రోజులు మాత్రం వారు దేవతా మూర్తులుగా ప్రజలచేత మన్ననలు అందుకుంటారు. పూజలు, పుణ్య కార్యక్రమాలకు అర్హులవుతారు. ఈ పది రోజులు వారికి పండుగే. ఈ పండుగనే ఇక్కడి ప్రజలు ‘కొల్లాయి పండగ’ అని పిలుస్తారు.

ప్రతి ఏడాది ఫిబ్రవరి లేదా మర్చి నెలలో జరిగే ఈ పండుగ అనాదిగా వస్తున్న సనాచారం. ఈ పది రోజులుపాటు హిజ్రాలు దేవతా మూర్తులుగా ముఖానికి రంగులు వేసుకుంటారు. సగం మనిషి, సగం దేవతామూర్తిగా ముఖానికి మేకప్ వేసుకుంటారు. దేవాలయానికి వచ్చి ప్రజలచేత పూజలు అందుకుంటారు. ప్రజలను సుఖశాంతులతో వర్థిల్లాల్సిందిగా దీవెనలిస్తారు. దేవాలయంలో నృత్యాలు చేస్తారు. వారిలో  కొందరు పూనకం వచ్చినట్లు ఊగిపోతూ భవిష్యవాణిని వినిపిస్తారు. మూర్చలు పోతారు. అనంతరం వీధుల్లో గుంపులుగా సంచరిస్తారు. ఆ గ్రామంలోని ప్రతి కుటుంబం వారిని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి కొత్త బట్టలతో సత్కరిస్తారు. వారి నుంచి దీవెనలు స్వీకరిస్తారు.

ఈ పది రోజులు మాత్రం హిజ్రాల జీవితం పుష్టిగా మూడు పూటల భోజనం, ఆరు పూటల తీర్థ ప్రసాదులుగా ఏ లోటు లేకుండా సాగిపోతుంది. పది రోజులు ముగిశాక వారు మళ్లీ సాదారణ జీవితంలోకి అడుగుపెడతారు. మళ్లీ కష్టాలు, కనీళ్లు షరా మామూలే. కాయకష్టం చేయకుండా పూట గడవడం కూడా కష్టమే. వారిలో కొందరు పెళ్లిళ్లు చేసుకొని కుటుంబాలను కూడా పోషిస్తుండగా, ఎక్కువ మంది జీవితాంతం బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. సమాజంలో మూడవ జెండర్‌గా గుర్తింపు పొందిన హిజ్రాలు అన్ని రంగాల్లో ఇప్పుడిప్పుడే రాణిస్తుండగా, ఇంకా ఆ మార్పు ఛాయలు మాత్రం తమిళనాడులోని దేవనిపట్టినమ్‌లో కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు