ఒళ్లు తెలియని కోపంతో..

6 Apr, 2015 23:34 IST|Sakshi

మోటారుసైక్లిస్ట్‌ని కొట్టి చంపారు
చిన్నారుల ఎదుటే తండ్రి ఉసురు తీసిన వైనం

 
సాక్షి, న్యూఢిల్లీ : ఓ చిన్న ఘటనతో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని గాలిలో కలిపేసింది. తమ కారును ఢీకొట్టాడన్న కోపంతో కొందరు దుర్మార్గులు ఇద్దరు చిన్నారుల అమాయకపు చూపుల మధ్యేవారి తండ్రిని ఒళ్లు తెలియని కోపంతో నిర్ధాక్షిణ్యంగా చంపేశారు. ఈ దారుణం ఆదివారం రాత్రి దరియాగంజ్ ప్రాంతంలో తుర్క్‌మన్‌గేటు వద్ద జరిగింది.

షానవాజ్(38) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను మోటారుసైకిల్‌పై కూర్చోబెట్టుకుని ఆదివారం రాత్రి ఇంటికి తిరిగివెళుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ఐ20 కారును అనుకోకుండా ఢీకొట్టాడు. ఇది చిన్న ఘటనే అయినప్పటికీ కారులోని వ్యక్తులు షానవాజ్‌తో వాదులాటకు దిగారు. ఒళ్లు తెలియని కోపంతో కర్రలు, ఇనుపరాడ్లతో షానవాజ్‌ను తీవ్రంగా కొట్టారు.

తలపై ఇనుపరాడ్ బలంగా తగలడంతో షానవాజ్ సృహతప్పి కిందపడిపోయాడు. దీంతో కారులో వచ్చిన వ్యక్తులు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. షానవాజ్ పడిఉండటాన్ని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే షానవాజ్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు రోడ్లను దిగ్బంధించారు. అటుగా వచ్చిన రెండు కార్ల విండోలను ధ్వంసం చేశారు. మరికొన్ని వాహనాలను తగలబెట్టారు. పోలీసులు ఆలస్యంగా రావడంతోనే నిందితులు పారిపోయారని వారు ఆరోపించారు. కాగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కారు ప్రయాణికుల కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. అలాగే వాహనాలను ధ్వంసం చేసిన వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఆ ప్రాంతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు