కొండల కింగ్‌

20 Nov, 2017 08:17 IST|Sakshi

ఆస్తమా పీడిస్తున్నా పర్వతారోహణలో రికార్డులు

ఇప్పటికి ప్రపంచంలో ఆరు ఎత్తైన శిఖరాల అధిరోహణ

డిసెంబరు నుంచి దక్షిణ ధృవ శిఖరారోహణ

బెంగళూరు టెక్కీ సత్యరూప్‌ సాహసం

ఆయన ఆశయం పర్వతాలను అధిరోహించడం. ఆర్థికంగా, ఆరోగ్యంగానూ అనుకూలించకపోయినా లక్ష్యసాధనలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ప్రపంచంలోనే గొప్ప పర్వతాలపైకి అడుగిడి భారత కీర్తిపతాకను ఎగురవేసే సన్నాహాల్లో ఉన్నారు.

సాక్షి, బెంగళూరు: ఆస్తమాతో బాధపడుతున్నా లెక్కచేయకుండా పట్టుదలతో బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించి త్వరలో ప్రపంచంలో ఏడవ ఎౖల్తైన పర్వతాన్ని ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సత్యరూప్‌ చిన్న వయసులోనే ఆస్తమా బారిన పడడంతో పాఠశాలలో తరగతి గదుల మెట్లను ఎక్కడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. చిన్న వయసు నుంచి మెల్లిగా చిన్న గుట్టలు,కొండలు ఎక్కడం ప్రారంభించారు. సిక్కింలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసి బెంగళూరులో ఒక ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం సంపాదించారు.

మౌంట్‌ విన్సన్‌పై గురి
అయితే పర్వతారోహణ లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేకపోయారు. 2008లో పర్వతారోహణకు నడుం బిగించారు. ఇప్పటివరకు ప్రపంచలోని అతిఎత్తైన ఆరు పర్వతాలను అధిరోహించిన సత్యరూప్‌ డిసెంబర్‌ 1 నుంచి ప్రపంచంలో ఏడవ ఎత్తైన అంటార్కిటికా (దక్షిణ ధృవం) ఖండంలోని దక్షిణ ధృవ పర్వతశ్రేణికి చెందిన మౌంట్‌ విన్సన్‌ మ్యాసిఫ్‌ పర్వతాన్ని అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఇది విజయవంతమైతే ప్రపంచంలో ఏడు ఎత్తైన శిఖరాలు (సెవెన్‌ సమిట్స్‌) అధిరోహించిన అతికొద్ది మందిలో ఒకరిగా కీర్తి గడించనున్నారు. ఇది పూర్తయితే అర్జెంటీనా,చీలి దేశాల మధ్యనున్న ప్రపంచలోని ఎత్తైన, ప్రమాదాలతో కూడిన మౌంట్‌డెల్‌ సలాడూ అగ్నిపర్వతాన్ని అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఎవరెస్టుపై మృత్యు పోరాటం
పర్వతారోహణలో ఎన్నో కష్టాలు ఆయనను చుట్టుముట్టినా వెనుతిరగలేదు. 2015లో ఎవరెస్ట్‌ అధిరోహణ సమయంలో నేపాల్‌లో సంభంవించిన భూకంపం అడ్డంకిగా నిలిచింది. దీంతో 2016లో ప్రయత్నించి ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించసాగారు. ప్రమాదవశాత్తు తమ ముగ్గురు సహచరులను కోల్పోవాల్సి వచ్చింది. బాధను దిగమింగి ప్రయాణం కొనసాగించారు.ఎవరెస్ట్‌ తుదికి చేరుకునే సరికి ఆక్సిజన్‌ మాస్క్‌లో లోపం వల్ల అరగంట పాటు మృత్యువు అంచుల్లోకి వెళ్లారు. కాగా, డిసెంబర్‌ నుంచి చేపట్టే యాత్రకు ఆర్థిక సాయం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు