పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ

4 Oct, 2016 08:19 IST|Sakshi
పార్టీ ముఖ్య నాయకులతో మంత్రి, ఎంపీ రహస్య భేటీ

భూ సమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులు
వారికి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వని అధికారులు
టీడీపీ ముఖ్యనాయకులతో మంత్రి, ఎంపీ రహస్య సమావేశం
అధికారపార్టీ నాయకులతో నాలుగు కమిటీలు
భూసమీకరణను వ్యతిరేకిస్తే తరిమికొడతామన్న మంత్రి కొల్లు
పోతేపల్లి, కోన గ్రామాల్లో ఎంఏడీఏ అధికారుల నిర్భందం
 
మచిలీపట్నం : బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ పేరిట ప్రభుత్వం చేపట్టిన భూసమీకరణకు అనుకూలంగా టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారు. నయానో, భయానో రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. మరో వైపు గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతర, అంగీకార పత్రాలు తీసుకుంటున్న ఎంఏడీఏ (మడా) అధికారులు తమదైన శైలిలో వ్యవహరిస్తున్నారు.
 
భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇస్తున్న రైతులకు అందుకు తగిన ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలేదు. కోన గ్రామంలో భూసమీకరణకు తమ భూములు ఇచ్చేది లేదని అభ్యంతర పత్రాలు ఇచ్చిన రైతులు ఆ మేరకు ధ్రవీకరణ పత్రంపై సంతకం చేసి ఇవ్వమంటే అధికారులు నిరాకరిస్తున్నారు. ఫారం-2 ఇచ్చిన రైతులకు ఆ పత్రం అందినట్లు సంతకం చేసి ఇవ్వాలని ఎక్కడా లేదని, ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని కోన డెప్యూటీ కలెక్టర్ సుబ్బరాజు పేర్కొన్నారు.
 
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నాని కోన గ్రామానికి వెళ్లి ఎంఏడీఏ అధికారులతో మాట్లాడారు. ఫారం-2 ఇచ్చినట్లుగా సంతకం చేయాలని కోరగా తన వద్ద స్టాంపు లేదని మంగళవారం సంతకాలు చేస్తానని సుబ్బరాజు బదులిచ్చారు. అయితే సంతకాలు చేసిన తరువాతే గ్రామం నుంచి కదలాలని పంచాయతీ కార్యాలయం వద్ద సుబ్బరాజు, ఇతర సిబ్బందిని రైతులు నిర్భందించినంత పనిచేశారు.
 
పోతేపల్లిలో రైతులు ఇచ్చిన అభ్యంతర ఫారాలు అందినట్లు డెప్యూటీ కలెక్టర్ బదులుగా తాను సంతకం చేస్తానని వీఆర్వో ప్రసాద్ చెప్పడంతో ఆగ్రహించిన రైతులు ఆయన్ను పంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. పేర్ని నాని అక్కడకు వెళ్లి రైతులతో మాట్లాడి వీఆర్వోను బయటకు తీసుకువచ్చారు.
 
వెలువడని గడువుపెంపు ఉత్తర్వులు
భూసమీకరణకు సంబంధించి అభ్యంతరాలు, అంగీకార పత్రాలు తీసుకునే గడువును నవంబర్ 4వ తేదీ వరకు పెంచినట్లు ప్రకటించినా సోమవారం సాయంత్రానికి కూడా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు. డీఆర్డీఏ కార్యాలయంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు అధికారులు, పాలకులు ప్రకటించారు. సోమవారం డీఆర్డీఏ కార్యాలయం కాదు, జిల్లా వ్యవసాయశాఖ కోసం నూతనంగా నిర్మించిన భవనంలో ఎంఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులకు సూచించారు.
 
గ్రామాల్లో పర్యటిస్తాం
టీడీపీ ముఖ్య నాయకులతో సమావేశం అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విలేకరులతో మాట్లాడారు. తాను, ఎంపీ కొనకళ్ల నారాయణరావు నెల రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతులను ఒప్పిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. భూసమీకరణకు అడ్డుపడే వారిని తరిమికొడతామన్నారు.

ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ పోర్టు, పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందన్నారు. భూసమీకరణ ద్వారా భూములను ఇచ్చిన రైతులకు మెగా టౌన్‌షిప్‌లో ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క ప్లాట్ విలువ కోటి రూపాయలు ఉంటుందన్నారు. రైతులు భూసమీకరణకు సిద్ధంగానే ఉన్నారని ఎంపీ చెప్పారు.

టీడీపీ నేతలతో రహస్య భేటీ
 మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు సోమవారం మచిలీపట్నం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో రహస్య సమావేశం నిర్వహించారు. భూసమీకరణకు రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వారిని ఒప్పించే బాధ్యతను కీలకమైన నాయకులకు అప్పగించారు. ఇందుకు మండలంలో నాలుగు కమిటీలను ఏర్పాటు చేశారు.
 
 మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్‌తో కమిటీలను ఏర్పాటు చేసి వారికి కొంత మంది నాయకులను అప్పగించారు. ఈ కమిటీల ద్వారా ఆయా సామాజిక వర్గాలు ఉండే గ్రామాలను ఎంపిక చేసుకుని రైతులను భూసమీకరణకు ఒప్పించేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
 
 రైతులు భూసమీకరణకు అంగీకరించడం లేదని, భూమి కోల్పోతే తమ బతుకులు రోడ్డున పడతాయని వారు భావిస్తున్నారని, అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ సక్రమంగా లేదని ఎంపీ, మంత్రి దృష్టికి ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు టీడీపీ నాయకులు తీసుకెళ్లారని సమాచారం.

మరిన్ని వార్తలు