ఎంపీనయ్యి ఆరునెలలే... అంతలోనేనా ?

30 Oct, 2019 11:35 IST|Sakshi

తిరువళ్లూరు : ఎంపీగా గెలిచి ఆరునెలలు కూడా కాకుండానే సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యమవుతుందటూ అర్జీదారులపై తిరువళ్లూరు ఎంపీ జయకుమార్‌ ఆగ్రహం వెళ్లగక్కారు. దీంతో చేసేదేమీలేక  రైల్వే సంఘం నేతలు నిరాశతో వెనుదిరిగారు. వివరాల్లోకి వెళితే.. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు బీడీఓ కార్యాలయంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించే కార్యకమాన్ని మంగళవారం ఉదయం ఎంపీ జయకుమార్, ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్‌ నేతృత్వంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కడంబత్తూరుకు చెందిన 43 గ్రామాల నుంచి 467 మంది వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీ వినతిపత్రాలు తీసుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న కడంబత్తూరు రైలు ప్రయాణికులసంఘం నేతలు కూడా అక్కడికి వచ్చారు. ఎన్నికల హమీలో భాగంగా కడంబత్తూరు రైల్వేస్టేషన్‌కు అబివృద్ధి నిధులు కేటాయించడంతో పాటు పాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు కడంబత్తూరులో ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేసేలా అధికారులపై ఒత్తిడి తేవాలన్నారు.

'ఇంతమంది ఒకేసారి వచ్చి తమ సమస్యలు పరిష్కరించమంటే ఎలా సాధ్యమవుతుందటూ మండిపడ్డారు. అయినా నేను ఎంపీనయ్యి ఆరు నెలలు కూడా కాలేదు.. కాస్త ఓపిక పట్టండి అంటూ ఎంపీ జయకుమార్‌ ఆగ్రహం వ్యక్తం  చేశారు. దీంతో ప్రయాణికుల సంఘం నేతలు నిరసన వ్యక్తం చేస్తూ బయటకు వచ్చారు. ఎంపీగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎన్నో హమీలను గుప్పించారని ప్రజలతో నిత్యం మమేకమవుతాననీ హమీ ఇచ్చి ఇప్పడు ఇలా ప్రవర్తించడం సరికాదనీ వారు ఆసహనం వ్యక్తం చేశారు.

వినతిపత్రాలు తీసుకున్న ఎంపీ వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని వినతిపత్రాలపై ప్రజలకు సమాచారం ఇవ్వాలని, ఎందుకు పరిష్కారం కాలేదో కూడా వివరించాలని సూచించారు. అయితే పరిష్కారం పేరిట భాదితులను తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని ఎంపీ అధికారులను హెచ్చరించడం కొసమెరుపు. 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు