చార్జీలు పెంచిన ఎంఎస్‌ఆర్టీసీ

8 Nov, 2013 02:37 IST|Sakshi

సాక్షి, ముంబై: బస్సు ప్రయాణం మరింత భారమయింది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ (ఎమ్మెస్సార్టీసీ) బస్సు చార్జీలను మరోసారి పెంచింది. ఈ ఏడాదిలో చార్జీలను పెంచడం ఇది రెండోసారి. రాష్ట్ర రవాణాసంస్థ (ఎస్టీయే) ఎమ్మెస్సార్టీసీ బస్సు చార్జీలను 2.6 శాతం పెంచేందుకు బుధవారం ఆమోదం తెలిపింది. ఈ సంస్థ గతంలోనూ చార్జీలను  6.48 శాతం పెంచింది. పెరిగిన చార్జీలు జూలై రెండో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే కొత్తగా పెరిగిన చార్జీలను శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్తింపజేయడానికి ఎస్టీయే అంగీకరించింది. అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు.. గత నెలలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు 2.6 శాతం మేర బస్సు చార్జీలు పెంచడానికి అనుమతించాలని ఎమ్మెస్సార్టీసీ ప్రతిపాదించింది.
 
 దీనిపై స్పందించిన రవాణాశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇటీవల ఎస్టీయే సమావేశం నిర్వహించారు. చార్జీలను పెంచేందుకు ఎస్టీయే అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఎమ్మెస్‌ఆర్టీసీ దేశంలోనే రెండో అతిపెద్ద ప్రజారవాణాసంస్థగా పేరుపొందింది. దీనిదగ్గర 17 వేల బస్సులు ఉన్నాయి.  ఇవి ముంబై నుంచి పుణే, ముంబై నుంచి గోవా, ముంబై నుంచి బెంగుళూరు..తదితర మార్గాల్లో సేవలు అందిస్తున్నాయి.  ఎమ్మెస్సార్టీసీ బస్సుల్లో రోజుకు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ముంబైలోని చాలా ప్రాంతాల్లోనూ ఈ బస్సులు సేవలను అందజేస్తున్నాయి. బాంద్రాకుర్లా కాంప్లెక్స్ నుంచి బోరివలి వరకు, పన్వేల్ నుంచి మంత్రాలయ వరకు బస్సులు నడుపుతున్నారు. ఒకే ఏడాదిలో రెండోసారి చార్జీలను పెంచడంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు