‘భత్కల్ పోలీసు వ్యాన్‌ను పేల్చాలనుకున్నాడు’

7 Feb, 2014 23:15 IST|Sakshi

ముంబై: 2011, జూలై 13 బాంబు పేలుళ్ల కేసుల్లో అరెస్టయి జైలు శిక్ష అనుభవిస్తున్న ఇండియన్ ముజాహిదీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ జనసంచారం అధికంగా ఉన్న దాదర్‌లో పోలీసు వ్యాన్‌ను పేల్చేందుకు కుట్ర పన్నాడు. అయితే అతను ఆ ప్రాంతానికి చేరుకునే సమయానికి పోలీసు వ్యాన్ అక్కడి నుంచి వెళ్లిపోయిందని రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్) వర్గాలు శుక్రవారం తెలిపాయి.

వ్యాన్‌లోని పోలీసులను చంపాలనుకున్నాడని వివరించాయి. చెత్తకుండీకి సమీపంలో  నాలుగో పేలుడు పదార్థాన్ని పెట్టిన భత్కల్ పథకం వేసిన రోజు పోలీసు వ్యాన్ లేకపోవడంతో ఆ బాంబును పేల్చలేదని చెప్పాయి. 2011, జూలై 13న ముంబైలో జనసంచారం ఉన్న ప్రాంతాల్లో మూడు వరుస బాంబు పేలుళ్లు జరగడంతో 21 మంది మృతి చెందగా, 141 మంది గాయపడ్డారు. సాయంత్రం 6.50 గంటలకు జావేరి బజార్‌లోమొదటిది, నిమిషం తర్వాత ఓపెరా హౌస్, 7.04 నిమిషాలకు సెంట్రల్ ముంబైలోని పశ్చిమ దాదర్‌లో పేలుడు జరిగిన సంగతి తెలిసిందే.

 అయితే ఈ కేసులో అరెస్టయిన భత్కల్‌ను విచారించగా మొత్తం నాలుగు పేలుడు పదార్థాలను అమర్చామని, అయితే నాలుగో బాంబును మాత్రం పేల్చలేదని అంగీకరించాడు. తూర్పు దాదర్‌లోని పూల మార్కెట్‌కు సమీపంలో సహచరుడు తహసీన్ అక్తర్ షేక్‌తో కలిసి రెండు పేలుడు పదార్థాలు నాటామని తెలిపాడు. అయితే పోలీసు వ్యాన్‌ను లక్ష్యంగా చేసుకున్నామని, ఆ రోజు అనుకున్న సమయంలో ఆ వాహనం లేకపోవడంతో ఆలోచనను విరమించుకున్నామని వివరించాడు. 2011 బాంబు పేలుళ్ల కేసులో భత్కల్, అక్తర్‌లను విచారించేందుకు న్యూఢిల్లీ నుంచి తీసుకొచ్చిన పోలీసులు విచారించారు. వీరిని గురువారం మోకా కోర్టు ముందు హాజరుపరచగా ఈ నెల 18 వరకు పోలీసు కస్టడీకి ఆదేశించింది.

మరిన్ని వార్తలు