15వ ముంబై చలనచిత్రోత్సవం ప్రారంభం

18 Oct, 2013 23:12 IST|Sakshi

 ముంబై: 15వ ముంబై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గురువారం రాత్రి నగరంలో ప్రారంభమైంది. లీ డానియల్ రూపొందించిన ‘ది బట్లర్’ అనే చారిత్రక సినిమాను తొలిరోజు ప్రదర్శించారు. చలనచిత్రోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా తొలుత గ్రీక్-ఫ్రెంచ్ దర్శక నిర్మాత కోస్టా గవ్రస్, నటుడు కమల్‌హాసన్‌లకు జీవితకాల సాఫల్య పురస్కారాలు అందజేశారు. వైట్‌హౌస్‌లో బట్లర్‌గా పనిచేసిన యూగెన్ అలెన్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
 
 యూగెల్ తన జీవితకాలంలో మొత్తం ఎనిమిది అమెరికా దేశ అధ్యక్షులకు బట్లర్‌గా పనిచేశాడు. ఈ సినిమాలో ఫారెస్ట్ విటకర్, సెలబ్రిటీ చాట్ కార్యక్రమానికి అతిథిగా వ్యవహరించిన ఓప్రా విన్‌ఫ్రే వంటి నటులు ప్రధాన పాత్రలు  పోషించారు. ఎనిమిది రోజులపాటు ఈ చలనచిత్రోత్సవం జరగనుంది. ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజెస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ చలనచిత్రోత్సవాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్యామ్ బెనెగళ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ చలనచిత్సోత్సవాల నిర్వహణకు శాశ్వత వేదిక కావాలని, అదేవిధంగా ప్రభుత్వ సహకారం కూడా కావాలని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ ఈ వేడుకలకు తమ ప్రభుత్వం కొంతమేర ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. వినోదపు పన్ను మినహాయింపు వివాదాన్ని పరిష్కరించేందుకుగాను చలనచిత్ర రంగానికి చెందినవారితో కలిసి పనిచేస్తుందన్నారు. తనపై అపార ప్రభావం చూపిన గవ్రస్‌కు జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయడం ఆనందం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా గవ్రస్ మాట్లాడుతూ సినీప్రేమికులు తనను ఆదరించడంతో ఎంతో ఉద్విగ్నతకు గురయ్యానన్నారు. అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ తన ఎదుగుదలకు తోడ్పడిన  శ్యామ్‌బెనెగళ్, గవ్రాస్, కె.జి.బాలచందర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. చలనచిత్రోత్సవ వేడుకలు తనవంటివారితో కలసి పనిచేసేందుకు చక్కని వేదికలవుతాయన్నారు.
 
 ఈ చలన చిత్రోత్సవంలో భాగంగా 65 దేశాలకు చెందిన మొత్తం 200 సినిమాలను ప్రదర్శించనున్నారు. ఇందులో ‘బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్’ అనే సినిమా కూడా ఉంది. ఇది స్వలింగ సంపర్కులపై తీసిన చిత్రం. దీంతోపాటు ‘ ది పాస్ట్’ అనే ఇరాన్ చిత్రం, ఆస్ట్రేలియాకు చెందిన ‘ఇన్‌సైడ్ ల్యూవిన్ డావిస్’, హాలీవుడ్ నటుడు జోసెఫ్ నటించిన ‘డాన్ జాన్’ తదితర సినిమాలు కూడా ప్రదర్శితమవుతాయి.

మరిన్ని వార్తలు