ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా సచిన్ అహిర్

5 Jul, 2015 03:01 IST|Sakshi
ముంబై ఎన్సీపీ అధ్యక్షుడిగా సచిన్ అహిర్

♦ వెల్లడించిన రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే
♦ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా నవాబ్ మలిక్ నియామకం
♦ బీఎంసీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న అహిర్
 
 సాక్షి, ముంబై : బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న తరుణంలో ఎన్సీపీ ముంబై అధ్యక్షునిగా మాజీ మంత్రి సచిన్ అహిర్‌ను ఎంపిక చేసింది. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుని పదవితోపాటు ముఖ్య అధికార ప్రతినిధిగా, ముంబై యూనిట్ ఇన్‌చార్జిగా నవాబ్ మలిక్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడు సునిల్ తట్కరే ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

వీరితోపాటు జిల్లాలవారి అధ్యక్షులను కూడా ప్రకటించారు. ముంబై ఎన్సీపీ అధ్యక్షుని రేసులో సచిన్ అహిర్‌తోపాటు కిరణ్ పావస్కర్, నవాబ్ మలిక్, సంజయ్ దీనా పాటిల్‌ల పేర్లను చర్చించారు. కాగా ఎన్సీపీ అహిర్‌ను ముంబై అధ్యక్షునిగా ఎంపిక చేసింది. గతంలో సచిన్ అహిర్ గృహనిర్మాణ శాఖ సహాయక మంత్రులుగా, ముంబైలో ఉట్టి ఉత్సవాలను ఎంతో ఘనంగా జరపపి తనదైన ముద్రవేసుకున్నారు. మిల్లు కార్మికుల సమస్యలపై ‘రాష్ట్రీయ మిల్ మజ్దూర్ యూనియన్‌లో విధులు నిర్వహించారు. మరోవైపు ‘ఇంటక్ కామ్‌గార్ యూనియన్’ అధ్యక్షుని పదవి కూడా చేపట్టారు.   

 స్వతంత్రంగా పోటీ చేస్తాం : అహిర్
 రాబోయే ఎన్నికల్లో పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని అహిర్ తెలిపారు. గత పదిహేనేళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయడం వల్ల తమ పార్టీ ప్రజల్లో గుర్తింపు పొందలేకపోయిందన్నారు. ఓటు బ్యాంకును పెంపొందించకోలేక పోయామన్నారు. బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి మొత్తం 227 స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. దహీహందీ, నవరాత్రి, గణేశ్ ఉత్సవాలు, పండుగల సమయంలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై మందిరాల ఏర్పాటుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు.

దహీ హందీ విషయమై గతంలో కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని, అప్పుడు కోర్టు స్టే ఇచ్చిందన్నారు. పండుగలకు అంతరాయం కలిగించకూడదనీ, పండుగలు నగరాలు ఏర్పడకముందే మొదలయ్యాయని చెప్పారు. ముంబై ఎన్సీపీ ఎగ్జిక్యూటివ్ కమిటీని త్వరలో వెల్లడిస్తామని తట్కరే అన్నారు.  100 మందిని బలిగొన్న కల్తీసారా కేసు, రైతుల సమస్యలు, బీజేపీ మంత్రులపై అవినీతి ఆరోపణలను త్వరలో జరగబోయే  అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు