ఈ సారికింతే...

27 Feb, 2015 22:57 IST|Sakshi

సాక్షి, ముంబై: కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ముంబైకర్లను కొంత నిరాశకు గురిచేసింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల కోసం కొత్త టెర్మినల్స్‌ను నిర్మించనున్నట్లు మంత్రి ప్రకటించడం నగర ప్రజలకు కొంతలో కొంత ఊరటినిచ్చే అంశం. ఈ టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం లోకల్ రైళ్లపై పడుతున్న అదనపు భారం చాలా వరకు తగ్గిపోనుంది. ఫలితంగా కొత్తగా లోకల్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుంది.

నగర విస్తరణ, రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని మూడు కొత్త టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను పశ్చిమ, సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగాలు రైల్వే బోర్డుకు పంపించాయి. ఇందులో పన్వేల్, ఠాకుర్లీ, వసయిరోడ్ స్టేషన్లు ఉన్నాయి. అందులో రెండు టెర్మినల్స్‌కు మంజూరు లభించే అవకాశముందని సూచన ప్రాయంగా మంత్రి వెల్లడించారు. పనులు పూర్తిచేసుకుని వినియోగంలోకి వస్తే ముంబైలో లోకల్ రైళ్లపై పడుతున్న దూరప్రాంతాల రైళ్ల భారం చాలా వరకు తగ్గిపోనుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఐదు టెర్మినల్స్ ఉన్నాయి. జనాభాతో పోలిస్తే ముంబైలో టెర్మినల్స్ సంఖ్య రెట్టింపు ఉండాలి. కాని పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.

ముంబైలో ప్రస్తుతం ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ), దాదర్, బాంద్రా, లోక్‌మాన్య తిలక్ (కుర్లా), ముంబై సెంట్రల్ టెర్మినల్స్ మాత్రమే ఉన్నాయి. వీటికి మరో మూడు అదనంగా చేరితే ముంబై వాసుల సమస్యలు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. సెంట్రల్ రైల్వే పన్వేల్, ఠాకుర్లిలో, పశ్చిమ రైల్వే వసయిరోడ్‌లో టెర్మినల్స్ నిర్మించాలనే ప్రతిపాదనను సంబంధిత బోర్డులు పంపించాయి.

గత బడ్జెట్‌లోనే పన్వేల్‌లో టెర్మినస్, కలంబోలి ప్రాంతంలో రైలు బోగీల నిర్వాహణ, మరమ్మత్తుల కోసం కోచింగ్ టెర్మినస్ నిర్మించాలని మంజూరు లభించినా అది అమలుకు నోచుకోలేదు. అవి ఏర్పాటయ్యుంటే నగరంలోని వివిధ టెర్మినల్స్‌పై భారం తగ్గేది. లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచాలంటే కొత్త టెర్మినల్స్ నిర్మాణం జరగాలి. చాలా సందర్భాలలో లోకల్ రైళ్లకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను లూప్‌లైన్‌లో పెట్టాల్సి వస్తోంది. కొత్త టెర్మినల్స్ ఏర్పాటైతే ఈ సమస్య కొంత మేర కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు