మందు, విందులతో చిందేసిన ముంబై...

24 Jul, 2017 20:27 IST|Sakshi
మందు, విందులతో చిందేసిన ముంబై...

► ఒక్కరోజులో ఆరు లక్షల కోళ్లు, లక్ష మేకలు తినేశారు.
► మంచి నీళ్లలా మందు తాగేశారు..


సాక్షి, ముంబై: ఆషాఢ ఏకాదశి ముగింపు (ఆదివారం) ఒక్క రోజే పెద్ద ఎత్తున మాంసం, మద్యం విక్రయాలు జరిగాయి. సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కావడంతో చివరి రోజు ఆదివారం ముంబై వాసులు పెద్ద ఎత్తున పార్టీలు, విందులు చేసుకున్నారు. రాత్రి బార్లు, హోటళ్లు, డాబాలు, వైన్‌ షాపులు ఇలా ఎక్కడ చూసిన కొనుగోలుదార్లతో కిటకిటలాడాయి. ఇలా ఆదివారం ఒక్క రోజు ముంబైలో ఏకంగా ఆరు లక్షల కోళ్లు, లక్షాకుపైగా మేకల మాంసం విక్రయించారు. అదేవిధంగా మద్యం, బీర్లు కూడా లక్షల లీటర్లలో అమ్ముడుపోయాయి.

ఎందుకంటే..?: సోమవారం నుంచి ప్రారంభమైన శ్రావణమాసం గణేశోత్సవాలు పూర్తయ్యేంత వరకు ఉంటుంది. దీంతో అనేక మంది ముంబై వాసులు గణేశ్‌ విగ్రహాలు నిమజ్జనం చేసేంత వరకు మాంసం, మద్యాన్ని ముట్టుకోరు. దీంతో చివరి రోజే తృప్తిగా మాంసం ఆరగించి మద్యాన్ని సేవించారు. నగరంలో బార్లలో, హోటళ్లలో చేసుకునే పార్టీలతోపాటు టవర్లు, సొసైటీ భవనాల టెర్రస్‌లపై అనేక మంది నివాసులు అర్థరాత్రి వరకు పార్టీలు చేసుకున్నారు. అదేవిధంగా చివరి రోజు పర్యాటక ప్రాంతాలకు వెళ్లిన వారి సంఖ్య కూడా అధికాంగానే ఉంది. దీంతో జలాశయాలు, రిసార్టులు, దాబాలన్నీ జనాలతో కిటకిటలాడాయి. అక్కడ పెద్ద ఎత్తున జనం మాంసంతో విందులు చేసుకున్నారు. ఈసారి శనివారం కూడా కలిసిరావడంతో ఒక రోజు ముందు నుంచే జల్సాలు చేసుకోవడం ప్రారంభించారు. కాని ఈ శ్రావణ మాసం పుణ్యమా అని కేవలం రెండు రోజుల్లో ఎక్సైజ్‌ శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.

>
మరిన్ని వార్తలు