పస్తులుంటున్న మురుగన్‌

19 Aug, 2017 20:15 IST|Sakshi

వేలూరు: రాజీవ్‌ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్‌ ఆహారం తీసుకోకుండా జైలు గదిలోనే ధ్యానం చేస్తున్నాడని అతని తరపు న్యాయవాది పుహలేంది శనివారం మీడియాకు వెల్లడించారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో మురుగన్, పేరరివాలన్, శాంతన్‌ వేలూరు సెంట్రల్‌ జైలులో, మురుగన్‌ భార్య నళిని వేలూరు మహిళా జైలులో జీవిత శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాను 26 సంవత్సరాలుగా జైలు జీవితం అనుభవిస్తున్నానని, జైలులోనే జీవ సమాధి అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని జైలు అధికారులను ఇటీవల లేఖ ద్వారా కోరాడు. అయితే ఇందుకు జైలు అధికారులు అనుమతించలేదు.

ఈ క్రమంలో ఈనెల 18వ తేదీ నుంచి ఆహారం తీసుకోకుండా పస్తులుంటున్నాడు. శనివారం ఉదయం మురుగన్, నళినిల న్యాయవాది పుహలేంది జైలులో వారిని కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియాకు వివరాలు వెల్లడించారు. మురుగన్‌ జీవితంపై విరక్తితో జీవ సమాధి అయ్యేందుకు నిర్ణయించుకున్నాడన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి, జైలు అధికారులకు లేఖ రాశాడన్నారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో మురుగన్‌ రెండో రోజు శనివారం కూడా ఆహారం తీసుకోకుండా ధ్యానంలోనే ఉన్నాడన్నారు. జైలులోనే తన భార్య నళినిని కలిసి మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదనా​‍్నరు. కాగా,కుమార్తె వివాహం కోసం పెరోల్‌ కోరుతూ నళిని వేసిన పిటిషన్‌ ఈనెల 18వ తేదీ విచారణకు వచ్చిందని, 22వ తేదీకి వాయిదా వేసినట్లు న్యాయవాది తెలిపారు.

మరిన్ని వార్తలు