ఆలయాలను శుభ్రం చేస్తున్న ముస్లిం యువకులు

9 Dec, 2015 16:01 IST|Sakshi
ఆలయాలను శుభ్రం చేస్తున్న ముస్లిం యువకులు

చెన్నై: ఆపద సమయంలో అందరూ ఒక్కటే. కులమతాలు రాజకీయ నాయకులకే తప్ప ప్రజలకు గుర్తురావనడానికి చెన్నై నగరాన్ని చుట్టుముట్టిన వరదల సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ. వర్షం కాస్త తెరిపిచ్చి వరద మట్టాలు తగ్గుముఖం పట్టడంతో ముస్లిం యువకులు నగరంలోని మసీదులతో పాటు హిందూ దేవాలయాలను పరిశుభ్రం చేశారు. ఇంకా చేస్తున్నారు. మొన్న ఓ ముస్లిం యువకుడు నీటిలో చిక్కుకున్న హిందూ కుటుంబానికి చెందిన ఓ నిండు చూలాలును సకాలంలో ఆస్పత్రికి చేర్చడం, అక్కడ ఆమె బిడ్డను సుఖంగా ప్రసవించడం, అందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఆ బిడ్డను యూనస్ అని ఆ ముస్లిం యువకుడి పేరును పెట్టుకోవడం తెల్సిందే.

ఆపత్కాలంలో సోషల్ మీడియా కూడా అద్భుత పాత్రను నిర్వహించింది. బాధితుల సమాచారం ప్రభుత్వాధికారులకు చేరవేయడం, సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అన్నార్తులకు ఆశ్రయం కల్పించడం, ఆపదులను ఆదుకోవడానికి స్వయంగా రంగంలోకి దిగడం తెల్సిందే. అలాగే మసీదులు, ఆలయాలు, చర్చిలు మతాలతో సంబంధం లేకుండా బాధితులందరికి ఆశ్రయం కల్పిస్తున్నాయి.  

ఇలాంటి సందర్భంలో ముస్లిం యువకులు దేవాలయాలను శుభ్రం చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రసార భారతి మంగళవారం చేసిన ‘ట్వీట్’ను సోషల్ మీడియా తీవ్రంగా విమర్శించింది. ‘గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ట్వీట్ చేయాల్సిందిపోయి ‘రేర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యుమానిటీ’ అని ట్వీట్ చేయడంపై ట్విట్టర్‌లో విమర్శలు వచ్చాయి.

ఇది అరుదైన విషయం కాదని, వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా భారతీయులంతా ఒకరికొకరు అండగా నిలుస్తారని, ప్రజలను కులమతాల పేరిట విడదీసేది రాజకీయ నాయకులేనని పలువురు ట్వీట్లు చేశారు. ఇంతకన్నా మంచి ప్రేజ్ దొరకలేదా అంటూ కొందరు,  ఇదేమి పైత్యమని మరికొందరు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు