చిదంబరం ‘సీఎం’

24 Sep, 2014 00:08 IST|Sakshi
చిదంబరం ‘సీఎం’

సాక్షి, చెన్నై : ‘సీఎం పదవికి అర్హుడు నా తండ్రి. అలాంటి వ్యక్తికి రాష్ట్ర పార్టీ పగ్గాల్ని అప్పగించాల్సిందే’ అని ఏఐసీసీకీ కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం సంకేతాన్ని పంపించారు. తన తండ్రి సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం టీఎన్‌సీసీలో చర్చకు దారి తీసింది.రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధిపత్యం కోసం ఈ గ్రూపుల మధ్య సాగుతున్న వివాదాలు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను చావు దెబ్బ తీశాయి. పూర్వ వైభవాన్ని చేజిక్కించుకుని తీరుతామన్న ధీమాతో నేతలు వేర్వేరుగా పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాల్ని చేజిక్కించుకునేందుకు తీవ్రంగానే గ్రూపుల నేతలు పావులు కదుపుతున్నారు. ఓ వైపు జీకే వాసన్‌కు అధ్యక్ష పగ్గాల్ని అప్పగించాలన్న నినాదం ఉన్నా, మరో వైపు చిదంబరం సైతం ఆ రేసులోనే ఉన్నారంటూ ఆయన మద్దతుదారులు డప్పులు వాయించే పనిలో పడ్డారు.
 
 ప్రస్తుతానికి ఆ పదవిలో జీకే వాసన్ మద్దతుదారుడైన జ్ఞాన దేశికన్ ఉన్నా, ఆయన్ను తప్పించడం లక్ష్యంగా ఏఐసీసీ వద్ద తీవ్రంగానే గ్రూపులు పావులు కదిపే పనిలో పడ్డాయి. ఈ సమయంలో ఆ పదవి ఏదో తన తండ్రికే ఇవ్వండంటూ ఏఐసీసీకి చిదంబరం తనయుడు కార్తీ సంకేతాన్ని పంపించారు. తన తండ్రి సమక్షంలో ఆయన అధిష్టానానికి సంకేతాలు ఇస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం టీఎన్‌సీసీలో చర్చకు దారి తీసింది.మోడీపై సెటైర్లు : చెన్నైలోని కామరాజర్ అరంగంలో సోమవారం రాత్రి దక్షిణ చెన్నై కాంగ్రెస్ నేతలు (చిదంబరం మద్దతుదారులు) సమావేశమయ్యారు. ఇందులో చిదంబరం ముఖ్య అతిథిగా పాల్గొని తన ప్రసంగంలో మోడీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికల ముందు తాను దాఖలు చేసిన మధ్యంతర బడ్జెట్‌ను ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కాపీ కొట్టారన్నారు.
 
 మోడీ ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. ఆయన తర్వాత తనయుడు కార్తీ చిదంబరం ప్రసంగం అత్యంత ఆసక్తికరంగానే సాగింది. తన తండ్రి సమక్షంలోనే ఆయన అధిష్టానానికి కొన్ని సంకేతాల్ని పంపించారు. పరోక్షంగా చిదంబరం మదిలో ఉన్న కోరికను తన నోటి ద్వారా బయట పెట్టారని చెప్పవచ్చు. రాష్ట్రంలో సీఎం అయ్యేందుకు తన తండ్రికి అన్ని అర్హతలు ఉన్నాయని, ఆయన చేతికి పార్టీ పగ్గాలు ఇవ్వకుండా కాలయాపన చేయొద్దంటూ ఏఐసీసీని విజ్ఞప్తి చేశారు. తన తండ్రి చిదంబరం సీఎం పదవికి అర్హుడని, ఆయనకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేయడం టీఎన్‌సీసీ వర్గాల్ని విస్మయంలో పడేసింది. కార్తీ వ్యాఖ్యలపై టీఎన్‌సీసీలో చర్చ మొదలైంది. తన ప్రసంగం అంతా జాతీయ స్థాయి అంశాలపై చిదంబరం దృష్టి సారిస్తే, ఆయన తనయుడు రాష్ట్రంలో తన తండ్రికి సీఎం పదవి ఇవ్వాలన్నట్టుగా వ్యాఖ్యలు చేయడాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏఐసీసీ అధిష్టానం ఒక వేళ చిదంబరం చేతికి రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇవ్వని పక్షంలో గతంలో మాదిరిగా వేరు కుంపటికి చిదంబరం సిద్ధం అవుతారా? అన్న ప్రశ్నను తెరపైకి తెచ్చే పనిలో కొన్ని గ్రూపులు  పడ్డాయి.

 

>
మరిన్ని వార్తలు