మా మంచి మామగారు..

4 Aug, 2014 08:24 IST|Sakshi
మా మంచి మామగారు..

మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని అతడి కోడలు, ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్  కరీనా కపూర్ ఖాన్ పొగడ్తలతో ముంచెత్తుతోంది. పటౌడీ జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు అతడి కుమారుడు సైఫ్ అలీఖాన్ ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ సైఫ్ ఆలోచనను మెచ్చుకుంది. ‘నేను మా మామగారితో మూడేళ్లు పాటు ఉన్నా.. చాలా నెమ్మదస్తుడు.. తక్కువగా మాట్లాడేవారు.. సైఫ్ అన్నా, నేనన్నా చాలా ఇష్టపడేవారు..’ అని కరీనా చెప్పింది. ‘అతడు ఏనాడు నామీద అభిమానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించలేదు.
 
 అయితే ఒకసారి నేను పటౌడీ(పట్టణం)లో ఉన్నప్పుడు నా భుజం మీద చెయ్యేసి మాట్లాడారు. అప్పుడు అర్థమైంది నాకు.. అతడి అభిమానం..’ అని చెప్పింది. ఆ అనుభవం నా జీవితాంతం గుర్తుంటుంది..’ అని ఆమె అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ‘నన్ను, సైఫ్‌ను చూసి మా మామగారు చాలా గర్వపడేవారు. ఆయన నేను చేసిన ‘ఓంకార’ సినిమా చూశారు. అందులో నా నటనను చూసి చాలా మెచ్చుకున్నారు..’ అని వివరించింది. ‘పటౌడ్ సాబ్ మంచి క్రీడాకారుడు.. అతడి జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. మరెందరికో ఆయన మార్గదర్శకుడయ్యాడు.. ఆయన నిర్యాణం తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో అతడిపై వచ్చిన ఆర్టికల్స్ చదివా..
 
  అతడిని ఎన్నికోట్ల మంది అభిమానిస్తున్నారో తెలిసి ఆశ్చర్యపోయా.. అతడికి కోడలిగా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నా..’ అని తెలిపింది.ఇదిలా ఉండగా, సైఫ్ కుమార్తె సారా సినిమాల్లో నటించనున్నదన్న వార్తలపై కరీనా స్పందించింది. ‘సారా న్యూయార్క్‌లో చదువుకుంటోంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకొచ్చే ఆలోచనలేదు.. అలాంటి ఆలోచన ఉంటే మీకే మొదట తెలియజేస్తాం..’ అంటూ నవ్వేసింది. కాగా, కరీనా ప్రస్తుతం అజయ్ దేవగన్ నటించిన ‘సింగం రిటర్న్స్’ సినిమాలో హీరోయిన్‌గా కనిపించనుంది.
 

మరిన్ని వార్తలు