విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్ :నాదేండ్ల

17 Oct, 2016 19:43 IST|Sakshi

ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు బోగస్ అని మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సమ్మిట్‌లో జరిగిన 361 ఎంఓయూల ద్వారా రూ. 4,76,878 కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే పది నెలలు దాటినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పగా.. ఒక్క ఉద్యోగం కూడా రాలేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా బహిర్గతమైందన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఆర్టీఐ చైర్మన్ లక్ష్మినారాయణ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీతో కలిసి ఆయన మాట్లాడారు.

 

సమ్మిట్ పేరుతో రూ. 28 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మనోహర్ ఆరోపించారు. ఇంత మొత్తాన్ని ఖర్చు చేసినట్లు జీవోలు విడుదల చేస్తే వారి బండారం బయపడుతుందనే ఉద్ధేశంతో కేవలం మెమోల ద్వారా రూ. 28 కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. సీఎం తాత్కాలిక కార్యాలయం కోసమే రూ.7.74 కోట్లు విశాఖలో సీఎం కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయానికి రూ. 7.74 కోట్లు ఖర్చు చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని మనోహర్ తెలిపారు. అలాగే సమ్మిట్ నిర్వహణ సందర్భంగా నాట్య కార్యక్రమానికి ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేశారన్నారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేసినా కచ్చితంగా జీవో విడుదల చేయాలన్న విషయాన్ని పక్కనపెట్టి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని దుయ్యబట్టారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా రాష్ట్రానికి ఒరిగింది శూన్యమన్నారు. సమ్మిట్‌కు 41 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరయ్యారని రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించగా.. ఇటీవల ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెలగ పూడిలోని సచివాలయంలో మాట్లాడుతూ సమ్మిట్‌కు 600 మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన లెక్కలకు, ఆర్థిక మంత్రి వెల్లడించిన ప్రకటనలకు చాలా తేడా ఉందన్నారు. సుపరిపాలన, పారదర్శకత, బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్విరాన్‌మెంట్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. స్వయానా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖపై సేకరించిన వివరాలు ఇలా ఉంటే మిగిలిన శాఖల అర్థం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తన అవినీతి బయటపడుతుందనే ఉద్ధేశంతోనే సదస్సు వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోందని, ప్రజాధనం దుర్వినియోగంపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన వెల్లడించారు.

 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా