'మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి'

10 Sep, 2016 20:31 IST|Sakshi
'మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కల్వకుర్తి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించి మంత్రి జూపల్లి కృష్ణారావును బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దనరెడ్డి డిమాండ్ చేశారు. ఈపీసీ టెండర్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. దీనికి సంబంధించి 2008లో ఇచ్చిన విజిలెన్స్ నివేదికను, ఆ తర్వాత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సీఏజీ) ఇచ్చిన నివేదికల్లోనూ దీనికి సంబంధించిన ప్రస్తావన ఉందన్నారు. కల్వకుర్తి అయిదు లిఫ్ట్‌లలో ఒక్క దానికి నీళ్లు వదిలి పాలమూరుకు స్వర్ణయుగమంటూ టీఆర్‌ఎస్ ప్రచారం చేయడాన్ని తప్పుబడుతున్నామన్నారు.
 
అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే సీఎం కేసీఆర్ తలుచుకుంటే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయ్యేవన్నారు. కనీసం ఈ ఏడాది మూడు నెలల కిందట విడుదల చేస్తే కనీసం మొక్కజొన్న, ఆరుతడి పంటలకు ఉపయోగపడి ఉండేదన్నారు. కల్వకుర్తి కోసం రెండేళ్లలో రూ. 245 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మంత్రి హరీష్‌రావు 2వేల కోట్లు ఖర్చుచేశామనడం దారుణమన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నపుడు పాలమూరు కోసం, కల్వకుర్తి ప్రాజెక్టు కోసం కేసీఆర్ ఏమి చేశారో చెప్పాలని డిమాండ్‌చేశారు.
 
కల్వకుర్తి సామర్థ్యం కుదించారని, కాల్వల వెడల్పు తగ్గించారని,. టన్నెల్ 9 మీటర్లు ఉండాల్సి ఉండగా దానిని దానిని మంత్రి జూపల్లి 6.85 మీటర్లకే కుదించారని ఆరోపించారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి రూ.10-15 వేల కోట్లు ఖర్చు చేస్తే 33 ప్రాజెక్టులు పూర్తయి 42 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉండగా, సీఎం కేసీఆర్ కోటి ఎకరాల పాట పాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల్లో కేసీఆర్ పాత్ర నామమాత్రం, శూన్యమని, జాప్యానికి మాత్రవం సీఎందే బాధ్యత అన్నారు.
 
 
మరిన్ని వార్తలు