ఆస్పత్రుల పనితీరుపై ‘జంగ్’!

6 Mar, 2014 22:22 IST|Sakshi
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్న తీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రులైన లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్, గురుతేజ్ బహదూర్ ఆస్పత్రుల రూపురేఖలు నెలరోజుల్లో మారిపోవాలన్నారు. ఇక ప్రైవేటు ఆస్పత్రులు కోర్టు ఆదేశాలను తప్పక పాటించాల్సిందేనన్నారు. ఈ విషయమై నజీబ్ జంగ్ గురువారం ఢిల్లీ ఆసుపత్రుల పని తీరును సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, ఆరోగ్య కార్యదర్శి, ఆర్థిక కార్యదర్శి, పీడబ్ల్యూడీ  కార్యదర్శి, ఢిల్లీ అసుపత్రుల ప్రతినిధులు, ఇన్‌స్పెక్టర్ల బృందం, లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయ సీనియర్ అధికారులతో ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆయన ఢిల్లీ ఆసుపత్రుల పనితీరును సమీక్షించారు. 
 
 ఢిల్లీ అసుపత్రులను తనిఖీచేసిన ఇన్‌స్పెక్టర్లు సమర్పించిన నివేదికలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రులలో రోగుల సంరక్షణ సదుపాయాలను, ఓపీడీ సదుపాయాలను, మందుల లభ్యతను, పారిశుధ్యాన్ని, భద్రతను, మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతను లెఫ్టినెంట్ గవర్నర్ నొక్కి చెప్పారు. లోక్‌నాయక్ జైప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రి, గురుతేజ్ బహదూర్ ఆసుపత్రులను మోడల్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దడం కోసం ఆయన ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన ఓ కమిటీని నియమించారు. ఆరోగ్య కార్యదర్శి, పీడబ్ల్యూడీ కార్యదర్శి సభ్యులుగా ఉన్న ఈ సంఘం ఈ రెండు ఆస్పత్రులను దత్తత తీసుకొని, వాటి పనితీరును, నిర్వహణను మెరుగుపరిచి నగరంలోని అత్యుత్తమ ఆస్పత్రుల స్థాయిలో నెలరోజుల్లో అభివృద్ధి చేయాలని జంగ్ ఆదేశించారు. ప్రైవేటు ఆసుపత్రులు తమ ఇన్‌పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లో 10 శాతాన్ని, ఓపీడీలో 25 శాతాన్ని పేద రోగుల ఉచిత చికిత్స కోసం కేటాయిస్తూ కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన్నారు. ఈ విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల పనితీరును పరిశీలించాలని లెప్టినెంట్ గవర్నర్ ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. పేదరోగులకు  కల్పించే ఈ సదుపాయాన్ని గురించిన సమాచారాన్ని  ప్రైవేటు ఆస్పత్రుల బయట,  రిసెప్షన్‌లో ప్రదర్శించేలా చూడాలని ఆయన ఆదేశించారు. 
 
>
మరిన్ని వార్తలు