నళినికి సమన్లు

25 Aug, 2016 01:40 IST|Sakshi
నళినికి సమన్లు

సాక్షి, చెన్నై: శారద చిట్స్ స్కాం కేసులో విచారణకు హాజరు కావాలని పి నళినికి సమన్లు జారీ అయ్యాయి. ఇది కాస్త కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత  పి.చిదంబరం వర్గీయుల్లో ఉత్కంఠను రేపి ఉన్నది. ఇక, కాంగ్రెస్ గ్రూపు రాజకీయ వర్గాల్లో అయితే, ఈ సమన్ల చర్చ హోరెత్తుతున్నది. రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల్లో బలమైన గ్రూపుగా కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వర్గం ఉన్నది. ఇటీవల కాలంగా చిదంబరాన్ని టార్గెట్ చేసి ఆరోపణలు బయలు దేరుతుండడం ఆ వర్గీయుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నది.
 
  ఇప్పటికే చిదంబరం తనయుడు కార్తీచిదంబరం మీద జాతీయ స్థాయిలో చర్చల్లో ఉన్న పలు కేసుల వ్యవహారాల ఆరోపణలు చుట్టుముట్టే పనిలో పడ్డాయి. అదే సమయంలో చిదంబరం సతీమణి, న్యాయవాది నళిని చిదంబరం చుట్టూ ప్రస్తుతం శారద చిట్ ఫండ్ స్కాం ఆరోపణలు సాగుతుండటం రాష్ట్రంలో చర్చకు తెర లేపి ఉన్నది. ఆ స్కాంలో ఇప్పటికే ఓ మారు నళినిని సీబీఐ విచారించి ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లో సాగిన ఈ స్కాం వ్యవహారం సెగ తమిళనాడుకు చెందిన నళిని చిదంబరాన్ని తాకి ఉండడం చిదంబరం వర్గాల్లో ఉత్కంఠను రేపుతున్నది.
 
 ఇక కాంగ్రెస్  గ్రూపు రాజీకీయాల్లో అయితే, చర్చ హోరెత్తుతున్నది. ఈ సమయంలో తాజాగా సీబీఐ నళిని చిదంబరానికి సమన్లు జారీ చేసి ఉండడం గమనార్హం. ఈ సమన్ల మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో కోల్‌కతాలో సీబీఐ విచారణాధికారి ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంటుంది. శారద చిట్ ఫండ్ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారి వద్ద జరిపిన విచారణ మేరకు ఇది వరకు ఓ మారు నళిని విచారణకు హాజరయ్యారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే కేసు విచారణలో నళినికి ప్రమేయం ఉన్నట్టుగా కొన్ని ఆధారాలు వెలుగులోకి వచ్చినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
 
 అయితే, ఇందులో ఏ మేరకు వాస్తవాలు  ఉన్నాయో ఏమోగానీ, సీబీఐ మాత్రం సమన్లు జారీ చేసి ఉండటం చిదంబరం మద్దతు దారుల్లో ఉత్కంఠను రేపి ఉండటం ఆలోచించ దగ్గ విషయమే. ఈ సమన్ల నేపథ్యంలో ఈ శారద చిట్ ఫండ్ స్కాం వ్యవహారాన్ని నళిని నెత్తిన కూడా బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టుగా చిదంబరం మద్దతు దారులు ఆరోపిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు