పాఠశాల కాదు పానశాల

13 Dec, 2019 08:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మహారాష్ట్ర పాఠశాలలో రాత్రివేళ మందుబాబుల చిందులు  

ఔరంగాబాద్‌: మందుబాబులకి ఎక్కడా చోటు దొరకనట్టుంది. సరస్వతీ నిలయమైన పాఠశాలని ఏకంగా పానశాల కింద మార్చేశారు. రాత్రి పూట పాఠశాలలో పూటుగా మందు తాగుతూ చిందులేస్తున్నారు. ఈ ఘోరం మహారాష్ట్రలో నాందేడ్‌ జిల్లాలోని ప్రభుత్వ జిల్లా పరిషత్‌ స్కూల్లో జరుగుతోంది. ఉదయం పాఠశాలకి వచ్చే విద్యార్థులు, టీచర్లకు పాఠశాల ప్రాంగణంలో చెదురుమదురుగా విసిరేసిన లిక్కర్‌ సీసాలు కనిపిస్తున్నాయి. వాళ్లు అవన్నీ శుభ్రం చేసుకున్న తర్వాత తరగతులు మొదలు పెట్టాల్సి వస్తోందని స్కూలు అధికారి ఒకరు చెప్పారు. నాందేడ్‌లో ముక్రామాబాద్‌ పోలీసు స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఉన్న స్కూల్లో గత కొద్ది రోజులుగా మందుబాబులు పాఠశాలనే తమకు అడ్డాగా మార్చుకున్నారు. అయినప్పటికీ పట్టించుకునే నాథుడే లేడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాఠశాల అధికారి ఒకరు చెప్పారు.

‘‘ఉదయం పాఠశాలకి వచ్చేసరికి లిక్కర్‌ బాటిల్స్‌ కనిపిస్తాయి. కొన్ని బాటిల్స్‌ విరిగి పడి ఉంటాయి. మా స్కూలుకి ప్యూన్‌ లేడు. రిటైర్‌ అయిపోయాడు. దీంతో విద్యార్థులు, టీచర్లే పాఠశాల ఆవరణని శుభ్రం చేయాల్సి వస్తోంది. తరచూ ఈ ఘటన జరుగుతూ ఉండడంతో పోలీసులకి ఫిర్యాదు చేశాము’’ అని ఆ అధికారి చెప్పారు. పాఠశాలకు కాంపౌండ్‌ వాల్‌ లేకపోవడంతో ఈ సమస్య ఎదుర్కొంటున్నామని ఆయన వివరించారు. ఇలాంటి చర్యలు పాఠశాలలో చదువుకునే వాతావరణాన్ని పాడు చేస్తాయని ముక్రామాబాద్‌ పోలీసు స్టేషన్‌ అసిస్టెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ కమలాకర్‌ అంగీకరించారు. ఇక నుంచి ఆ స్కూలుపై నిరంతర పర్యవేక్షణ జరుపుతామని చెప్పారు.

మరిన్ని వార్తలు