నేతృత్వ బాధ్యతలపై రాణే, అశోక్ చవాన్ దృష్టి

22 May, 2014 22:22 IST|Sakshi

 సాక్షి, ముంబై: రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో రాబోయే రోజుల్లో పలు కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఇప్పటికే మంత్రులు నారాయణ రాణే, విజయ్ రావుత్ రాజీనామాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికే జరుగుతున్న సమీక్ష సమావేశాల్లో పదాధికారులు, కార్యకర్తల అభిప్రాయాలు స్వీకరిస్తున్న ఎంపీసీసీ నేతలు తదనుగుణంగా పార్టీని పటిష్టపరిచేందుకు మార్పులు చేసే అవకాశముందని తెలుస్తోంది.

 ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ లోక్‌సభ ఎన్నికలలో పరాజయానికి నైతికబాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించినప్పటికీ రాజీనామాకు మాత్రం ససేమిరా అన్నారు. ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఎంపీసీసీ తీర్మానించిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు పృథ్వీరాజ్ చవాన్‌ను తప్పించే అవకాశాలు కనబడుతున్నాయి. దీంతో  అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని మళ్లీ  రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించేందుకు ఇద్దరు మాజీ సీఎంలు   సిద్ధమవుతున్నారు. నారాయణ రాణే, అశోక్ చవాన్ ఎవరికి వారుగా తమ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతృత్వ బాధ్యతలు అప్పగించాలని నేరుగా ఎలాంటి ప్రకటనలు చేయకున్నా, తెరవెనుక తమ పనులు చకచకా చేసుకుంటూ వెళుతున్నారని పార్టీ వర్గాల్లో వినబడుతోంది. మళ్లీ సీఎం పీఠం దక్కించుకునేందుకు ఎవరికివారుగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

 రాణే దూకుడు...
 కొంకణ్‌లో తన కుమారుడైన నీలేష్ రాణే పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేసిన నారాయణ రాణే తనదైన శైలిలో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తప్పుకోవాలని పార్టీపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఇది నిజమేననట్టుగా కాంగ్రెస్ నేతృత్వ బాధ్యతలు నారాయణ రాణేకు అప్పగించాలని సింధుదుర్గా జిల్లా కాంగ్రెస్ తీర్మానించింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు మార్పులు జరిగే అవకాశాలున్నాయనే వాదనకు బలం చేకూర్చినట్టైంది. లోక్‌సభ ఎన్నికల పరాజయంపై సమీక్ష సమావేశంలో కూడా నారాయణ రాణే పొల్గొనలేదు.

ఇలాచేసి పృథ్వీరాజ్ చవాన్ కూడా నైతిక బాధ్యత వహిస్త్తూ తనలాగే రాజీనామా చేయాలని సంకేతాలు ఇచ్చారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుత సమయంలో ఓ ప్రణాళిక ప్రకారం దూకుడుగా ముందుకువెళ్లి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవాలనుకుంటున్న రాణే అందుకు తగ్గట్టుగానే చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గట్టెక్కించాలంటే దూకుడుగా ఉండే నాయకుడు అవసరమని అందరికీ తెలియజేసేలా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయాలపై మాత్రం అటు పార్టీ, ఇటు రాణే ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు.

 మళ్లీ కీలకపాత్రపై అశోక్ దృష్టి...
 ఆదర్శ్ కుంభకోణం కేసు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి దాదాపు అజ్ఞాతంలోకి వెళ్లిన అశోక్ చవాన్‌కు లోక్‌సభ ఎన్నికలు ఊపిరిని పోశాయి. ఆదర్శ్‌తోపాటు పేయిడ్ న్యూస్ అంశం ఇంకా ఆయనను వెంబడిస్తున్నా లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అశోక్‌చవాన్ వర్గీయుల్లో మాత్రం ఓ కొత్త ఆశ చిగురించేలా చేశాయి. తన పరిధిలోని నాగపూర్, హింగోలి ఎంపీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన అశోక్ చవాన్ మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు పెంచాలనుకుంటున్నారు. ఆదర్శ్ కుంభకోణం దర్యాప్తు నివేదికను మంత్రి మండలి తోసిపుచ్చడంతో ఆయన కీలకంగా వ్యవహరించేందుకు ఆస్కారాలున్నాయని అందరూ భావించారు.

ఇందుకు తగ్గట్టుగానే లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో కూడా పరిస్థితులు మారాయి. ఇప్పటివరకు పృథ్వీరాజ్ చవాన్, మాణిక్‌రావ్ ఠాక్రేలకు అభయమిస్తు వస్తున్న అధిష్టానం కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నేతృత్వాన్ని మార్చాలా? అనే దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. కాగా, మరో ఐదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు విజయం లభించేందుకు మాస్‌ను ఆకర్షించడంతో పాటు అందరినీ కలుపుకుపోయే నేత అవసరం ఉందని భావిస్తున్నారు. మరాఠ్వాడా నాయకుడు, దివంగత మాజీ సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ అనంతరం ఆయన స్థానాన్ని భర్తీ చేసే నాయకులెవరూ కాంగ్రెస్‌కు లభించలేదని చెప్పవచ్చు.

 ముఖ్యమంత్రి పథ్వీరాజ్ చవాన్ పరిపాలన క్లీన్‌గా ఉన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించలేకపోయారు. మరోవైపు అశోక్ చవాన్‌కు బాధ్యతలు అప్పగించిన రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. రాష్ట్రంలో మోడీ ప్రభంజనం లేదని, సరైన నేతృత్వం లేకపోవడంతోనే మిగతా ప్రాంతాల్లో పరాజయం పాలైందని అశోక్ చవాన్ పేర్కొంటున్నారు. దీన్నిబట్టి ఆయన మళ్లీ రాష్ట్రంలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. 

మరిన్ని వార్తలు