వారిని బట్టలూడదీసి ఊరేగించాలి: నారాయణ

27 Jun, 2013 15:22 IST|Sakshi
K Narayana

కార్పొరేట్ విద్యాసంస్థలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులను బట్టలూడదీసి ఊరేగించాలని అన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలు కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూనీ చేస్తున్న నాయకులను వందసార్లు ఉరేసినా పాపంలేదని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మెదడు అరికాలులో పెట్టుకుందని ఎద్దేవా చేశారు.  వైఎస్సార్ జిల్లాలోని దేవుని కడపలో జరిగిన అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్రస్థాయి విద్యా, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతుల్లో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్ వరద బాధితుల తరలింపుపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తోసుకోవడంపై కూడా నారాయణ తనదైన శైలిలో స్పందించారు. డెహ్రాడూన్‌లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీల చిల్లర చేష్టలను కుక్కల కొట్లాటగా ఆయన అభివర్ణించారు.  ఆ నాయకులు పోట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద మైదానాలు ఉన్నాయని, అంతేకాని ఎక్కడికో వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పరువు తీయడమెందుకని డెహ్రాడూన్‌లో కొట్లాడుకున్న ఎంపీలను నారాయణ ప్రశ్నించారు. అయితే వివాదస్సద వ్యాఖ్యలు చేయడం నారాయణకు అలవాటే. గతంలోనూ ఆయన నోటి దురుసు ప్రదర్శించి విమర్శలపాలయ్యారు.

మరిన్ని వార్తలు