హౌసింగ్ సొసైటీ సమస్యలపై మోడీ స్పందన

24 May, 2014 22:56 IST|Sakshi

ముంబై: ఎన్నికల ప్రచారంలో రాజకీయ నాయకులకు అనేక మంది సామాన్య ప్రజలు తమ సమస్యలను చెప్పుకొంటారు. అలాగే వాళ్లూ తమ సమస్యలను పరిష్కరించమంటూ ఆ నేతకో లేఖ రాశారు. ఆ సంగతి కూడా మరిచిపోయారు. ఇప్పుడాయన ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. వారి సమస్యను గుర్తు పెట్టుకొని పరిష్కరించమంటూ అధికారులకో లేఖ రాశాడు.

 ఆ రాజకీయ నాయకుడు మోడీ. వినతి పత్రా న్ని సమర్పించింది ముంబై సబర్బన్ హౌసింగ్ సొసైటీవాసులు. తాము చేసిన విజ్ఞాపనను గుర్తుం చుకొని మరీ బీజేపీ నేత నరేంద్ర మోడీ స్పందించడంతో తమ స్థానిక సమస్యలు పరిష్కారమవుతాయనే సబర్బన్ హౌసింగ్ సొసైటీవాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ కాంప్లెక్స్‌కు వెళ్లే రోడ్లు దారుణంగా ఉన్నాయని, వాటికి మరమ్మతు చేయాలని కోరుతూ ఉత్తర ముంబైలోని ఒబె రాయ్ స్ప్రింగ్స్ కాంప్లెక్స్ వాసులు గతంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి 2010 నుంచి నేటివరకూ 70 లేఖలు రాశారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వీధి దీపాలు లేవని, వర్షపు నీరు పోవడానికి కాలువలు కూడా లేవని లేఖల్లో పేర్కొన్నా రు.

నాలుగేళ్లుగా తాము ఎన్నిసార్లు వెళ్లినా బీఎంసీ అధికారులు అందుబాటులో కూడా లేరని హౌసింగ్ సొసైటీ మాజీ ఛైర్మన్ ప్రకాష్ మీర్‌పురి తెలిపారు. తరువాత 2014 ఏప్రిల్ 5న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి లేఖ రాశామని, అదే లేఖను మోడీ కి కూడా పంపామని చెప్పారు. రాహుల్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదని, మోడీ సెక్రటేరియెట్‌లోని ప్రకాశ్ మజుందార్ అనే వ్యక్తి మే 5న ‘ఆ కాలనీ వాసుల సమస్యలు పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలంటూ’ తమ లేఖను రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు చేరవేశారని మీర్‌పురి తెలిపారు. ఎట్టకేలకు తమ సమస్య ప్రభుత్వం దృష్టికి రావడం ఆనందంగా ఉందని, ప్రస్తు తం ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన మోడీ స్పందన చూసి పరిపాలన పట్ల ఇప్పుడిప్పుడే ఆశ కలుగుతోందని చెప్పారు.

మరిన్ని వార్తలు