కలామ్‌ స్మారక మందిరం ప్రారంభం

27 Jul, 2017 12:03 IST|Sakshi►కలాం.. కలకాలం!

చెన్నై: మాజీ రాష్ట్రపతి, దివంగత అబ్దుల్‌ కలామ్‌ స్మారక మండపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. రామేశ్వరం జిల్లా పేయ్‌కరుంబులో రూ.15 కోట్లతో నిర్మించిన కలాం స్మారక మండపాన్ని గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రధాని ఆవిష్కరించారు. కలాంను పేయ్‌కరుంబులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో  ఖననం చేసిన విషయం తెలిసిందే. అదే స్థలంలో రూ.15 కోట్లతో ఈ స్మారక మండపాన్ని నిర్మించారు. అబ్దుల్‌ కలాం రెండో వర్ధంతి సందర్భంగా  మోదీ ఈ మండపాన్ని ఆరంభించారు. అలాగే కలామ్‌ కుటుంబసభ్యులతో ఆయన ముచ్చటించారు. అంతకు ముందు కలామ్‌ సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆ తర్వాత ‘కలాం...సలాం’ అంటూ రూపొం దించిన గీతాన్ని ప్రధాని మోదీ సహా దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది విద్యార్థులు ఒకేసారి ఆలపించారు.  ‘కలాం విషన్‌ 2020 సంతోష్‌ వాహినీ’  ప్రసార వాహనాన్ని ప్రారంభించారు. 12.25 గంటలకు రామేశ్వరం–అయోధ్య ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలను, రామేశ్వరం నుంచి ధనుష్కోటికి రూ.55 కోటత్లో నిర్మించిన జాతీయ రహదారిని ఆరంభించారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నితిన్‌ గడ్కరి, పొన్‌ రాధాకృష్ణన్, నిర్మలా సీతారామన్‌ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, సీఎం ఎడపాడి పళనిస్వామి, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.

చరిత్ర ఎరుగని బందోబస్తు
ప్రధాని మోదీ రాక సందర్భంగా రామేశ్వరం జిల్లాలో తమిళనాడులో గతంలో ఎన్నడూ ఎరుగని రీతిలో బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఉచ్చిపుళ్లి విమానాశ్రయం నుంచి రామేశ్వరం వరకు జాతీయ రహదారి పొడవునా వేలాది మంది పోలీసులు బందోబస్తు పాటిస్తున్నారు.  బుధ, గురువారాల్లో సముద్రంలో చేపలవేటకు మత్య్సకారులను అనుమతించలేదు. భారత నౌకాదళం, సముద్రతీర గస్తీదళం సైతం సముద్ర తీరంపై నిఘా పెట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు.  

రాష్ట్రపతిగా పదవీ విరమణ తరువాత సైతం భావిభారత పౌరులను తీర్చిదిద్దేందుకు అవిశ్రాంతగా పాటుపడ్డారు అబ్దుల్‌కలాం. మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో 2015 జూలై 27వ తేదీన జరిగిన ఒక సమావేశంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ వేదికపైనే ఆయన కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచారు. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు సైతం కలాం మృతికి కన్నీళ్లు పెట్టాయి. అబ్దుల్‌కలాం జన్మించిన రామేశ్వరం పేయ్‌ కరుంబులో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఆయన ఆశయాలను ప్రతిబింబించేలా నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.50 కోట్లతో స్మారక మండపాన్ని నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ అదేరోజు ప్రకటించారు.

ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో..
స్మారక మండప నిర్మాణ పనులను డిఫెన్స్‌ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ) పర్యవేక్షణలో సాగాయి. ప్రస్తుతం తొలిదశగా రూ.15 కోట్లతో మణిమండపం, రూ.10 కోట్లతో పరిసరాల్లోని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మండప నిర్మాణానికి అవసరమైన అపురూపమైన వస్తువులను దేశం నలుమూలల నుంచి (కేరళ మినహా) తెప్పించారు. ప్రధానమైన ప్రవేశ ద్వారాలను తంజావూరు శిల్పులు తీర్చిదిద్దారు. స్థానిక పనివారితోపాటు బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నిర్మాణ రంగ నిపుణుల సేవలను వినియోగించారు. వీరుగాక కొత్త ఢిల్లీ నుంచి 500 మంది పనివారిని రప్పించారు. దేశంలోని అనేక ప్రముఖ కట్టడాల స్ఫూర్తితో దీని నిర్మాణం చేపట్టారు. అబ్దుల్‌ కలాం జీవితంలోని ప్రధాన ఘట్టాలను అక్కడ పొందుపరిచారు.  


అద్భుతమైన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం

పేపర్‌ బాయ్‌గా జీవితం ప్రారంభించి భార త ప్రథమ పౌరుడి స్థాయి వరకు తన జీవనగమనంలో అన్నింటా తన బాధ్యతలకు వన్నెతెచ్చారు కలాం. అంతరిక్ష శాస్త్రవేత్తగా ఆయన చేసిన సేవలు నేటికీ మరువలేనివి. అందుకే అన్నింటిలోకి ఆయన ఇష్టపడే అంతరిక్ష ప్రయోగాలకు గుర్తుగా ఫొటో మ్యూజియంలో రాకెట్‌ నమూనాలను ఉంచారు. ఆయనలోని కళాకారుడిని పరిచయం చేసేలా కలాం రూపొందించిన చిత్ర లేఖనాలను అమర్చారు. ప్రాంగణం పరిసరాల్లో పచ్చదనం ఉట్టిపడుతోంది.

డీఆర్‌డీవో కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా 24/7 పనిచేసేలా సీసీ  కెమెరాలను అమర్చారు. రెండోదశలో అబ్దుల్‌కలాం వినియోగించిన పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, విజ్ఞాన కేంద్రం, ఆడిటోరియం నిర్మిస్తారు. కలాం వర్ధంతి రోజు జూలై 27, జయంతి రోజైన అక్టోబర్‌ 15వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా