నరేంద్ర హత్య కేసు కొలిక్కి వచ్చేదెన్నడో?

20 Nov, 2013 23:09 IST|Sakshi

 పుణే: ప్రముఖ సంఘసంస్కర్త నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు మొత్తం 22 పోలీసు బృందాలు రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బృందాలు ఇప్పటిదాకా 1,100 మంది స్థానికులతోపాటు సాక్షులను విచారించారు. దీంతోపాటు ఘటనాస్థలికి సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను సైతం పరిశీలించారు. ఇంకా 700 మంది హిస్టరీ షీటర్లను ప్రశ్నించారు. ఈ విషయమై హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటిదాకా ఎటువంటి పురోగతీ లేదని అంగీకరించారు. అయితే దర్యాప్తులో ఎటువంటి లొసుగులు లేవన్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కేసు విచారణ సరైన దిశలోనే కొనసాగుతోందన్నారు. కాగా నరేంద్ర హత్యకు గురైన వెంటనే నగర పోలీసులు నిందితుల ఊహాచిత్రాలను మీడియాకు విడుదల చేసిన సంగతి విదితమే. అనేకమంది అనుమానితులను ప్రశ్నించారు. అయినప్పటికీ నిర్దిష్ట ఆధారాలను సేకరించడంలో విఫలమయ్యారు. కాగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న దభోల్కర్‌ను ఆగస్టు 20వ తేదీ తెల్లవారుజామున వాకింగ్ వెళ్లి వస్తున్న సమయంలో ఆయన ఇంటికి సమీపంలోనే ఉదయం గం.7.30 ని.లకు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
 నరేంద్ర హంతకుల ఆచూకీ తెలియజేసినవారికి రూ. 10 లక్షల రివార్డు ఇస్తామంటూ అప్పట్లో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రకటించారు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసు శాఖకు బాగా ఉపయోగపడింది. ఈ కేసు విచారణ సమయంలో అనేక నేరాల్లో పాలుపంచుకున్న నిందితులను పోలీసులు పట్టుకోగలిగారు.
 

మరిన్ని వార్తలు