శశికళ కన్నీరు మున్నీరు

29 Jul, 2017 08:06 IST|Sakshi
చిన్నమ్మ మెడకు మరో ఉచ్చు

చిన్నమ్మ మెడకు మరో ఉచ్చు
డీఐజీ రూప తరహా ఆరోపణలు
విచారణ కోరుతూ కర్ణాటక న్యాయవాది ఫిర్యాదు
వదిన మరణంతో శశికళ కన్నీరు


అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు జైల్లో శిక్ష అనుభవిస్తూ.. తనకు లగ్జరీ వసతులు కల్పించిన అధికారులకు రూ.2కోట్లు ఇచ్చినట్టు జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప ఆరోపణలు చేశారు. అయితే వీటికి బలం చేకూరుస్తూ బెంగళూరుకు చెందిన న్యాయవాది చిన్నమ్మ జైలు జీవితంపై విచారణ జరపాలని అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేశారు.


సాక్షి ప్రతినిధి, చెన్నై : ఇల్లయినా.. జైలైనా.. దర్జాగా బతకాల్సిందే..! అనే పాలసీని పెట్టుకున్న అన్నాడీఎంకే (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మెడకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. రూ.2 కోట్లతో జైలు అధికారులను మభ్యపెట్టి సకల వసతులు పొందుతున్నట్లుగా జైళ్లశాఖ మాజీ డీఐజీ రూప చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ బెంగళూరుకు చెందిన నటరాజశర్మ అనే న్యాయవాది గళం విప్పాడు. శశికళ జైలు జీవితంపై విచారణ జరపాలని కోరుతూ అవినీతి నిరోధకశాఖకు గురువారం ఫిర్యాదు చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇళవరసి, సుధాకరన్‌ బెంగళూరు జైల్లో నాలుగేళ్ల శిక్షను అనుభవిస్తున్నారు. ఈ ముగ్గురినీ చూసేందుకు తమిళనాడు మంత్రులు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ సహా బంధువులు, పలువురు ప్రముఖులు తరచూ వచ్చేవారు. ఈ దశలో కర్ణాటక జైళ్లశాఖ  డీఐజీ రూప బాధ్యతలు చేపట్టిన కొత్తలో శశికళ ఉంటున్న జైలును తనిఖీ చేయగా ఆమెకు కల్పించిన ప్రత్యేక రాయితీలు, వసతులు బైటపడ్డాయి. శశికళతోపాటు ఇంకొందరు ఖైదీలు విలాసవంతమైన సౌకర్యాలను అనుభవిస్తున్నట్లు రూప కనుగొన్నారు. లగ్జరీ సదుపాయాలు కల్పించినందుకు డీజీపీ సత్యనారాయణరావు సహా పలువురు మొత్తం రూ.2 కోట్ల ముడుపులు అందుకున్నారని కర్ణాటక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం ద్వారా సంచలనం కలిగించారు. డీజీపీ

సత్యనారాయణరావును వీఆర్‌కు, డీఐజీ రూపను జైళ్ల శాఖ నుంచి ట్రాఫిక్‌ విభాగానికి  బదలీ చేసిన ప్రభుత్వం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిచే విచారణ జరిపిస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని డీజీపీ సత్యనారాయణరావు ఖండించారు. అంతేగాక  రెండు రోజుల్లోగా క్షమాపణలు చెప్పకుంటే రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేస్తానని డీఐజీ రూపకు ఆయన నోటీసులు పంపారు. నా వృత్తి ధర్మం నిర్వహించాను, క్షమాపణలు చెప్పను, కేసును ఎదుర్కొంటానని రూప కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించారు. ఉత్కంఠ భరితంగా ఈ కేసు సాగుతుండగా, రూప వాదనను బలపరుస్తూ న్యాయవాది నటరాజ శర్మ మరో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

రూ.2 కోట్ల ముడుపుల్లో ప్రమేయం ఉన్న దినకరన్‌తోపాటూ ఆస్ట్రేలియాకు చెందిన ప్రకాష్‌ అనే వ్యక్తిని కూడా విచారణ చేయాలని ఆయన కోరాడు. దినకరన్‌ స్నేహితుడు మల్లికార్జున్‌ కోరిక మేరకే ప్రకాష్‌ సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. జైల్లో సేకరించిన ఆధారాలను డీఐజీ రూప తన ఉన్నతాధికారుల కంటే మీడియాకు బహిర్గతం చేయాల్సిన పరిస్థితులపై కూడా విచారణ కోరారు.

శశికళ కన్నీరు మున్నీరు
సమస్యలపై సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న శశికళను వదిన మరణం మరింతగా కలచివేసింది. తన అన్న భార్య, టీటీవీ దినకరన్‌కు అత్తగారైన సంతానలక్ష్మి ఈనెల 26న మృతి చెందారు. అంత్యక్రియల్లో పాల్గొనేలా శశికళ పెట్టుకున్న పెరోల్‌ దరఖాస్తును సైతం అధికారులు నిరాకరించినట్లు సమాచారం. దీంతో మరింత కృంగిపోయిన శశికళ రెండురోజులు విలపిస్తుండగా జైల్లోనే ఉన్న సమీప బంధువు ఇళవరసి ఓదారుస్తున్నట్లు తెలిసింది.

రూప ఆరోపణల తరువాత జైల్లో కట్టుదిట్టం చేయడంతో శశికళకు బైట నుండి ఎటువంటి వస్తువులు అందడం లేదు. శివలింగానికి పూలు, పాలతో పూజ చేసే శశికళకు ప్రస్తుతం ఏవీ అందడం లేదు. దీంతో జైల్లోని నీళ్లతో జలాభిషేకం చేస్తూ దైవ ప్రార్దనలతో గడుపుతున్నారు. అలాగే పురుషుల జైల్లో ఉన్న  సుధాకరన్‌ కాళీమాతకు పూజలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు